Top 5 This Week

Related Posts

గణపతి లొంగు‘బాట’లో ‘కొండపల్లి’ దృశ్యం!?

యాదృచ్చికమే కావచ్చు. విప్లవోద్యమ చరిత్రలో దాదాపు ఒకే రకపు దృశ్యాలు సాక్షాత్కరిస్తున్నాయి. ఒకప్పటి పీపుల్స్ వార్, ప్రస్తుత మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు టాప్ లీడర్లు దాదాపుగా ఒకే తరహాలో పార్టీ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితులు అనివార్యమయ్యాయా? ఇద్దరూ కార్యదర్శి పదవికి దూరమైన తర్వాతే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయా? మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి లొంగుబాటలో పయనించనున్నారనే వార్తల నేపథ్యంలో ఇవే సందేహాలను విప్లవ కార్యకలాపాల పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. పరిణామాలను మరోవైపు ఆసక్తిగా గమనిస్తున్నారు కూడా.

పీపుల్స్ వార్ పార్టీ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య అలియాస్ కేఎస్ ఉదంతాన్ని ఓసారి క్లుప్తంగా మననం చేసుకున్నట్లయితే… 1980లో పార్టీని స్థాపించిన కొండపల్లిని పార్టీ కార్యదర్శి పదవి నుంచి 1991లో తొలగించారు. అనంతర పరిణామాల్లో 1993లో కేఎస్ తన స్వగ్రామంలోనే పోలీసులకు పట్టుబడ్డారు. కేఎస్ స్థానంలో ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీని విస్తృతపరిచే అంశంలోనేగాక, సైద్దాంతికంగా, రాజకీయంగా కొండపల్లిని గణపతి తీవ్రంగా వ్యతిరేకించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. సాయుధ పోరాటమే శరణ్యంగా గణపతి వాదించి కేఎస్ ను కార్యదర్శి పదవి నుంచి తొలగించడమేగాక పార్టీ నుంచి బయటకు పంపించారన్నది అప్పటి వార్తల సారాంశం.

తాజా ప్రచారం ప్రకారం గణపతి కూడా కేంద్ర కమిటీ కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నాకే లొంగిపోతారనే వార్తలు వస్తుండడం గమనార్హం. దాదాపు ఏడాదిన్నర క్రితమే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజ్ బాధ్యతలు స్వీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కొండపల్లి తరహాలోనే గణపతిని కూడా కార్యదర్శి పదవి నుంచి తొలగించారని, వయోభారం, అనారోగ్యం వల్ల గణపతే స్వచ్ఛందంగా పార్టీ బాధ్యతలను బసవరాజ్ కు అప్పగించారని భిన్న వాదనలు ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ ప్రస్తుతం కేంద్ర కమిటీ కార్యదర్శి పదవిలో గణపతి లేరనేది మాత్రం సుస్పష్టం.

ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి

ఈ పరిణామాల్లోనే గణపతి లొంగిపోతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే గణపతి వంటి నక్సల్ నేత లొంగుబాటలో పయనిస్తారా? అనే అంశంపైనే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా, సైద్ధాంతికంగా తీవ్ర విభేదాలు ఏర్పడి, పార్టీలో ఉండలేని పరిస్థితులు, పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప ‘గణపతి లొంగుబాటు’ ప్రచారం నిజం కాకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. వయోభారం, అనారోగ్యం లొంగుబాటకు ప్రామాణికం కాకపోవచ్చని కూడా విప్లవ కార్యకలాపాల పరిశీలకులు ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకీ గణపతి లొంగిపోతారా? లేదా? అనే ప్రశ్నలను వదిలేస్తే, మొత్తంగా పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శులుగా పనిచేసిన కొండపల్లి, గణపతిల ప్రస్థానం దాదాపు ఒకే తరహాలో ఉందనే అభిప్రాయాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి.

Popular Articles