Top 5 This Week

Related Posts

ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ సంచలన హెచ్చరిక

వాహనాలు నడిపే ‘మైనర్’ల తల్లిదండ్రులకు ఖమ్మం నగర ట్రాఫిక్ పోలీసులు సంచలన హెచ్చరిక జారీ చేశారు. ర్యాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవర్లు అధిక సంఖ్యలో పట్టుబడుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఏసీపీ బి. శ్రీనివాసులు ఈ హెచ్చరిక జారీ చేయడం గమనార్హం. ఇందులో భాగంగానే ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ, డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన మైనర్ల తల్లిదండ్రులను కూడా ఇక నుంచి కోర్టులో హాజరు పరుస్తామని వార్నింగ్ ఇచ్చారు.

ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు పర్యవేక్షణలో ట్రాఫిక్ పోలీసులు నగరంలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఇటీవల కాలంలో రోడ్డుప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ట్రాఫిక్‌ పోలీసులు ప్రతిరోజు నగరంలో వాహనాల తనిఖీలు చేపడుతున్నారని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మద్యం మత్తులో వాహనాలను నడపడం ఒకటైతే, మరొకటి ర్యాష్ డ్రైవింగ్ అని, అదేవిధంగా మైనర్లు బైకులు, కార్లు నడుపుతూ వరుసగా ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు.

ఖమ్మం నగరంలో తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు

అయితే గతంలో మైనర్ డ్రైవింగ్ చేస్తు పోలీసులకు పట్టుబడితే జరిమానా వేసి , తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేవారమని చెప్పారు. కానీ ఇక నుంచి డ్రైవింగ్ చేస్తున్న మైనర్ల వాహనాలు సీజ్ చేసి, వారితో పాటు వారి తల్లిదండ్రులను కూడా కోర్టులో హజరు పరుస్తామని వెల్లడించారు. తద్వారా న్యాయస్థానం శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉంటుందన్నారు. కాబట్టి ఇకనైనా తల్లిదండ్రులు మైనర్లకు వాహనం ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు.

కొందరు యువకులు ద్విచక్ర వాహనాలకు సంబంధిత సంస్థ ఇచ్చిన సైలెన్సర్లను మార్పుచేసి అధిక శబ్దం వచ్చే వాటిని అమర్చుతూ, పాదచారులకు భయభ్రంతులు కలిగేలా రోడ్లపై అకస్మాత్తుగా వింత శబ్దాలు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. హారన్లను సైతం అదే తరహాలో అమర్చుతున్నారని, అటువంటి వారి ఆట కట్టించేందుకు ట్రాఫిక్ పోలీసు దృష్టి సారించి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలకు తీసుకుంటున్నారని తెలిపారు.

అదేవిధంగా లైసెన్సు, నంబర్‌ ప్లేట్‌ నంబర్‌ సక్రమంగా లేని, నంబర్‌ టాంపరింగ్ కలిగిన, నంబర్‌ తుడిపివేసిన వాహనాలను గుర్తించేందుకు తనిఖీలు చేస్తున్నామని పట్టుబడిన వాహనాలపై అయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.

Popular Articles