Friday, October 17, 2025

Top 5 This Week

Related Posts

ఆశ., దోశ., స్టార్ హోటల్, ఖమ్మం తెలుగు తమ్ముళ్ల వ్య(క)థ

సాక్షాత్తూ ఆ చంద్రబాబే ఫోన్ లో తమకు సాక్షాత్కరించారని ‘తెలుగు తమ్ముళ్లు’ ఉబ్బి తబ్బిబ్బయ్యారు. దేవినేని ఉమా వంటి సీనియర్ నాయకుడి ద్వాారా కబురొచ్చిందని ఎగిరి మరీ గంతేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టికెట్లిస్తామని చెబుతున్నారని మహదానందంతో విజయవాడకు బయలుదేరారు. విలాసవంతమైన స్టార్ హోటల్ లో దిగారు. ఆ తర్వాత బోధపడింది అసలు సంగతి.

విషయంలోకి వెడితే.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి ఆనుకుని ఉండే కాకర్లపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ వీరాభిమాని ఒకరికి గత నెలాఖరులో ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు పీఏను మాట్లాడుతున్నానని, ఉమా సార్ వీడియో కాల్ చేస్తారని చెప్పాడు. కాసేపటికే దేవినేని ఉమా ముఖాన్ని పోలి ఉన్న వ్యక్తి వీడియో కాల్ రానే వచ్చింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పిల్లల చదువుకోసం సహాయం చేయాలని అతను కోరాడు. మూడు ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాడు. అంతటి దేవినేని ఉమాగారే తమను డబ్బు అడిగారని భావించి, కాదనలేని తెలుగు తమ్ముడు రెట్టించిన ఉత్సాహంతో రూ. 35 వేలు పంపాడు.

ఆ తర్వాత కొద్దిరోజులకే ఈనెల 7వ తేదీన దేవినేని ఉమా ముఖాన్ని పోలిన వ్యక్తే మళ్లీ అదే తెలుగు తమ్ముడికి ఫోన్ చేశాడు. తెలంగాణాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ భావిస్తోందని, అక్కడి సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పుడు మన పార్టీయేనని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ బలం గల ఖమ్మం వంటి జిల్లాలో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు పార్టీ స్థిర నిర్ణయంతో ఉందని చెప్పాడట. అందువల్ల స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్న ఔత్సాహికులను తీసుకుని విజయవాడ రావాలని చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వీడియో కాల్ చేస్తారని దేవినేని ఉమా మొహంతో మాట్లాడిన వ్యక్తి చెప్పాడట.

అతను చెప్పిన ప్రకారం కాసేపటికే చంద్రబాబు ముఖంతో గల వ్యక్తి నుంచి కూడా వీడియో కాల్ వచ్చిందట. దీంతో అంతా నిజమేనని ఆ తెలుగు తమ్ముడు నమ్మాడు. గత బుధవారం రాత్రి 7.30 గంటల నుంచి 8.30 గంటల వరకు తెలంగాణా టీడీపీ నాయకులతో సీఎం చంద్రబాబు సమావేశమవుతున్నారని, స్థానిక ఎన్నికల్లో పోటీపై నిర్ణయం తీసుకున్నారని చెప్పాడు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నవారిని తీసుకుని విజయవాడకు రావాలని, చంద్రబాబుతోనే నేరుగా బీ. ఫారాలు ఇప్పిస్తానని దేవినేని ఉమా మొహంతో వీడియో కాల్ లో మాట్లాడిన వ్యక్తి చెప్పాడట.

ఇంకేముందు ఎక్కడాలేని ఉత్సాహం వచ్చింది సత్తుపల్లి తెలుగు తమ్ముడికి. దేవినేని ఉమా ముఖంతో గల వ్యక్తితో వీడియో కాల్స్ లో మాట్లాడిన స్థానిక టీడీపీ వీరాభిమాని తనతోపాటు మరో 17 మందిని వెంటేసుకుని అర్జంటుగా విజయవాడకు బయలుదేరాడు. ఏదేని హోటల్ లో ఉండాలని, హోటల్ బిల్లు కూడా తామే చెల్లిస్తామని వీడియో కాల్ చేసిన వ్యక్తి చెప్పాడట. దీంతో బందర్ రోడ్డులో గల ఓ ప్రముఖ స్టార్ హోటల్ లో వీళ్లంతా బస చేశారు. చంద్రబాబును కలిసి బీ.ఫారాలు తీసుకునేందుకు పసుపు చొక్కాలు ధరించి మరీ తెలుగు తమ్ముళ్లు రెడీ అయ్యారు.

అయితే చంద్రబాబును కలిసేందుకు కేవలం ఎనిమిది మందికి మాత్రమే అనుమతి ఉందని, అందరూ ఆయనను కలవాలంటే తలా రూ. 10 వేలు చెల్లించాలని వీడియో కాల్స్ ద్వారా మాట్లాడిన వాళ్లే తిరిగి ఫోన్ చేసి చెప్పారట. ఇదే సమయంలో హోటల్ సిబ్బంది వచ్చి తిన్న ఫుడ్డుతోపాటు హోటల్ బిల్లు చెల్లించాలని పట్టుబట్టడంతో తెలుగు తమ్ముళ్లు హతాశులయ్యారట. ఈ సందర్భంగా హోటల్ సిబ్బందికి, సత్తుపల్లి ప్రాంత తెలుగు తమ్ముళ్లకు మధ్య తీవ్ర వాగ్వాదం కాస్తా ఘర్షణ స్థాయికి చేరిందట. స్టార్ హోటల్ బిల్లు మొత్తాన్ని తలచుకుని బెంబేలెత్తిన తెలుగు తమ్ముళ్లు చెప్పాపెట్టకుండా స్టార్ హోటల్ నుంచి మెల్లగా జారుకున్నారని సమాచారం.

దీంతో బందరు రోడ్డులోని ఆ ప్రముఖ స్టార్ హోటల్ యాజమాన్యం తమ బిల్లు విషయంలో మాచవరం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విషయాన్ని దేవినేని ఉమా చెవిన వేయడంతో తాను ఎవరికీ ఫోన్ చేయలేదని, ఏలూరుకు చెందిన భార్గవ్ అనే వ్యక్తి తన పేరుతో ఇలా మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందని ఆయన చెప్పారట. అయితే మొత్తం ఎపిసోడ్ లో సత్తుపల్లి తెలుగు తమ్ముళ్లు మాత్రం తాము మోసపోయిన విషయాన్ని బహిర్గతం చేస్తే పరువు పోతుందని స్తబ్ధుగా ఉండిపోయారట.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టూల్స్ ను ఉపయోగించిన దుండగులు దేవినేని ఉమా, చంద్రబాబు ముఖాలను పోలిన వ్యక్తులతో సత్తుపల్లి తెలుగు తమ్ముళ్లకు వీడియో కాల్స్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఏఐ టెక్నాలజీకి బుక్కయ్యామని తాము తెలుసుకునేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయిందని సత్తుపల్లి ప్రాంత బాధిత తెలుగు తమ్ముళ్లు లోలోనే కుములిపోతున్నారట. పార్టీకి చెందిన సీనియర్లను కనీసం సంప్రదించకుడా, విషయం చెప్పకుండా ఎగేసుకుని విజయవాడకు వెళ్లినవారికి తగిన శాస్తే జరిగిందని ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన కేడర్ ఘటనపై కథలు కథలుగా చెప్పుకుంటుండడం అసలు విశేషం.

Popular Articles