ఖమ్మం జిల్లా విద్యార్థులు రాజ్ భవన్ లో సందడి చేశారు. ఖమ్మం రూరల్ మండలం మల్లెమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 6వ తరగతి విద్యార్థులు మంగళవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలవడం విశేషం. పీఎం శ్రీ పథకం కింద ఎక్స్ ప్లోజివ్ విజిట్ లో భాగంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజల ప్రోద్బలంతో రాజ్ భవన్ ను విద్యార్థులు సందర్శించారు.
ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న కిచెన్ గార్డెన్స్ విధానం గురించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో పండించే కూరగాయలతో మధ్యాహ్న భోజనం అందించడాన్ని గవర్నర్ అభినందించారు. విద్యార్థులు గవర్నర్ కు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. తాము గీసిన గవర్నర్ చిత్రపటాన్ని జిష్ణుదేవ్ వర్మకు బహుమతిగా అందించారు.
మల్లెమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాజభవన్ పర్యటనకు గాను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ ఏర్పాట్లను చేశారు. రాజ్ భవన్ ను విద్యార్థులకు పూర్తిస్థాయిలో చూపించేలా గవర్నర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ ఆదేశాల మేరకు పిల్లలకు అధికారులు రాజ్ భవన్ ను పూర్తిగా చూపించారు. గవర్నర్ ను కలిసిన విద్యార్థులు రాజ్ భవన్ లో చాలా సంతోషంగా గడిపారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ ను విద్యార్థిని విద్యార్థులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, జిల్లా యంత్రాంగం ఘనంగా సత్కరించింది. ఈ పర్యటనలో జిల్లా విద్యాశాఖ అకాడమిక్ అధికారి రామకృష్ణ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణ వేణి, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
మల్లెమడుగు విద్యార్థులతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతోషంగా గడిపిన దృశ్యాలను దిగువన గల గ్యాలరీలో చూడవచ్చు.