ఒళ్లు గగుర్పొడిచే హత్యోదంతమిది.. సేద్యంలో నష్టాలు చవి చూసిన ఓ వ్యక్తి ఆసుపత్రిలో ఆయాగా పనిచేసే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకుని, ఆమె ద్వారా పరిచమైన మరో పురుషునితో స్వలింగ సంపర్కం నెరపి, తల, మొండెం వేరు చేసి, అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి చెట్టుకొకటి, పుట్టకొకటిగా పడేసిన దారుణ నేర ఘటనను ఖమ్మం రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ హత్యోదంతానికి దారి తీసిన పూర్వాపరాలను ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం..
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్యాలకు చెందిన పరిమి అశోక్ (36) ఎం.ఫార్మసీ చదువుకున్నాడు. నాలుగైదేళ్ల క్రితం అతని తల్లిదండ్రులు అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి అశోక్ ప్రయివేట్ గా పని చేసుకుంటున్నప్పటికీ, తద్వారా వచ్చే డబ్బు అతని జల్సాలకు, అటవాట్లకు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకుని వంగతోట సేద్యంలోకి దిగాడు. ఇందుకోసం తనకు తెలిసిన కొందరి వద్ద అప్పులు చేసి సేద్యం చేయగా, నష్టాలు రావడంతో ఆర్థిక భారం పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలోనే అశోక్ కు ఖమ్మంలోని క్యూర్ హాస్పిటల్ లో ఆయాగా పనిచేస్తున్న కొమ్ము నగ్మా(32)తో ఏర్పడిన పరిచయం కాస్తా ఇద్దరి మధ్య శారీరక సంబంధానికి దారి తీసింది. ఇదే దశలో ఖమ్మం గ్రంథాలయంలో పనిచేస్తున్న కామేపల్లి మండలం కెప్టెన్ బంజరకు చెందిన గట్ల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్ (40)తో అశోక్ కు ఏర్పడిన పరిచయం స్నేహంగా మారి, ఇద్దరి మధ్య స్వలింగ సంపర్కానికి దారి తీసింది. అశోక్ రూంకు వెళ్లినపుడల్లా వెంకట్ అతని ఖర్చులకు డబ్బు ఇస్తుండేవాడు. ఇదే దశలో బల్లేపల్లి సమీపంలోని బాలప్పేటకు చెందిన పెంటి కృష్ణయ్య అలియాస్ కృష్ణ రామస్వామి అనే వ్యక్తితోనూ అశోక్ కు పరిచయం కలిగింది. వీరి మధ్య స్నేహం కూడా బలంగా మారింది.
అయితే ధనవంతుడిలా కనిపించే వెంకట్ తన గదికి ఈసారి వచ్చినపుడు అతన్ని ఎలాగైనా చంపి, అతని వద్దగల బంగారం, డబ్బు తీసుకోవాలని అశోక్ తోపాటు కృష్ణ, నగ్మాలు కుట్ర పన్నారు. కానీ ఓ మనిషిని చంపడం ఏ విధంగా సులభతరమనే అంశంపై కృష్ణను అశోక్ అడిగాడు. కత్తితో గొంతు భాగంలో నరకడం వల్ల అరవకుండా చంపవచ్చని కృష్ణ అశోక్ కు సూచించాడు. ఆ తర్వాత మనిషిని చంపడం గురించి, చంపిన మనిషిని విడిభాగాలుగా ఎలా చేయాలి? అనే అంశాలపై తన సెల్ ఫోన్ ద్వారా యూ ట్యూబ్ లో అశోక్ తెలుసుకున్నాడు. హత్యకు అవసరమైన కత్తులను అశోక్ కొనుగోలు చేశాడు. గత నెల 15వ తేదీన రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఇవేవీ తెలియని వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్ అశోక్ గదికి వచ్చి పడుకున్నాడు. తెల్లవారుజామున, అంటే గత నెల 16వ తేదీన వెంకట్ నిద్రిస్తున్న సమయంలో నగ్మాను అశోక్ బయట కాపలాగా ఉంచాడు. నిద్రలో వెల్లకిలా పడుకున్న వెంకట్ గొంతుపై తాను తెచ్చుకున్న కత్తితో బలంగా నరకడంతోపాు మెడపైనా పలుసార్లు అశోక్ కత్తివేట్లు వేశాడు. దీంతో వెంకట్ తలా, మొండెం వేరయ్యాయి. ఆ తర్వాత అదే కత్తితో వెంకట్ శరీరాన్ని ముక్కలుగా నరికి కవర్లలో శరీరభాగాలను కూర్చి, దుప్పటిలో మూటగా కట్టాడు అశోక్. ఆ తర్వాత మోటార్ సైకిల్ పై దుప్పటి మూటను తీసుకువెళ్లి, కవర్లలో కూర్చిన వెంకట్ శరీర భాగాలను కరుణగిరి ప్రాంతంలోని పొదల్లో, చెత్తలో విసిరేశాడు. ఆ తర్వాత ఘటనకు పాల్పడిన గదిని రక్తపు మరకలు లేకుండా శుభ్రం చేశాడు.

అయితే తన అన్న కనిపించడం లేదంటూ వెంకట్ తమ్ముడు కొండ యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ‘మిస్సింగ్’ ఘటనగా కేసున నమోదు చేసుకున్న పోలీసులు వెంకట్ ను అశోక్, నగ్మా, కృష్ణలు కలిసి దారుణంగా హత్య చేసినట్లు దర్యాప్తులో తేల్చారు. కేసును సవాల్ గా స్వీకరించిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితులను పట్టుకోవడం విశేషం. వెంకట్ ను దారుణంగా హత్య చేసిన పరిమి అశోక్ ను, కొమ్ము నగ్మాను, పెంటి కృష్ణను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఒక బైక్ ను, హత్యకు గురైన వ్యక్తి నుంచి దోచుకున్న 2.7 తులాల బంగారు గొలుసును, నాలుగు సెల్ ఫోన్లను, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

కేసు పరిశోధనలో ప్రతిభను కనబర్చిన సింగరేణి షీఐ తిరుపతిరెడ్డిని, కామేపల్లి, కారేపల్లి ఎస్ఐలు. బి. సాయికుమార్, బి. గోపి, కానిస్టేబుళ్లు సంపత్, ఆనంద్, ఆంజీ, రాజేష్, ఉపేందర్, సైదాలను ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఏసీపీ తిరుపతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నేరాలకు పాల్పడేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని చెప్పారు. ఎంత తెలివైన నేరస్థుడైనా ఎక్కడో ఓచోట తప్పు చేస్తాడని, ప్రస్తుత సాంకేతికత కాలంలో అసలే తప్పించుకోలేరని చెప్పారు. అందువల్ల నేర యోచనే మంచిది కాదని ఏసీపీ తిరుపతిరెడ్డి పేర్కొన్నారు.