మహాశివరాత్రి సందర్భంగా తీర్థాల జాతరకు వచ్చే భక్తులకు ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి కీలక సూచనలు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు రవాణాపరంగా ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసు శాఖ తరపున తీసుకున్న చర్యలు, పార్కింగ్ ప్రదేశాలు, ట్రాఫిక్ ఆంక్షలు, నిబంధనల గురించి ఆయన కూలంకషంగా వివరించారు. జిల్లా నలుమూలల నుంచే గాక ఇరుగు పొరుగు జిల్లాల నుంచి వివిధ రూట్లలో జాతరకు చేరుకునే భక్తులు ఖచ్చితంగా తెలుసుకోవలసిన అంశాలను రూట్లవారీగా ఏసీపీ వివరించారు.
గోళ్ళపాడు-తీర్థాల మార్గంలో ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ఆటోలు తీర్థాల బ్రిడ్జి ముందుగల స్టాండులో, కార్లు, టూ వీలర్లు బ్రడ్జికి అవతలివైపు నిర్దేశించిన పార్కింగ్ స్థలంలో మాత్రమే పార్క్ చేయాలన్నారు. ఈ మార్గంలో వచ్చే ట్రాలీలు, లారీలు ఇతర వాహనాలను పల్లెగూడెం నుంచి ఎంవీ పాలెం మీదుగా గుండాల తండావైపు పయనించి ఆయా మార్గంలో గల పార్కింగ్ ప్రదేశంలో వాహనాలను నిలుపుకోవలసి ఉంటుందని ఏసీపీ చెప్పారు.
అదేవిధంగా మంగళగూడెం-డోర్నకల్ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు తీర్థాల-మంగళగూడెం మధ్య ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో నిలపాలన్నారు.
ఖమ్మం నుంచి కామంచికల్ రూట్లో వచ్చే వాహనాలు కామంచికల్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన స్థలంలో పార్కింగ్ చేయాలన్నారు.
పాపటపల్లి, కామేపల్లి మీదుగా వచ్చే వాహనాలు కామంచికల్ ఊరిబయట గల బ్రడ్జి వద్ద నిర్దేశిత స్థలంలో పార్కింగ్ చేసుకోవాలని తిరుపతిరెడ్డి సూచించారు.
ఇక ముల్కలపల్లి మార్గం నుంచి వచ్చే వాహనాలు ఎంవీ పాలెం నుంచి గుండాలతండా-తీర్థాల గ్రామాల మధ్య ఊరిబయట గల పార్కింగ్ స్థలంలో నిలపాలని చెప్పారు.
దైవదర్శనం చేసుకున్న తర్వాత కామంచికల్ రూట్లో వచ్చిన భక్తులు తిరుగు పయనంలో ఖమ్మం వెళ్లడానికి కామంచికల్ గ్రామ పంచాయతీ పక్కన గల రోడ్డు నుంచి కోయచలక, రఘునాథపాలెం రూట్లో వెళ్లాలని ఏసీపీ పేర్కొన్నారు.
తీర్థాల జాతర దేవాలయంలో ఎటువంటి వీవీఐపీ, వీఐపీ, వాహనాల పాసులు లేవన్నారు. దేవాలయానికి పార్కింగ్ ప్రదేశాలు 100 నుంచి 150 మీటర్ల దూరంలోనే ఉంటాయి కాబట్టి, భక్తులు కాలినడకనే వచ్చి సంగమేశ్వరస్వామిని దర్శనం చేసుకోవలని ఉంటుందని చెప్పారు.
జాతరలో బందోబస్తు, విధినిర్వహణలో గల పోలీసులకు భక్తులు సహకరించాలన్నారు. ట్రాఫిక్ ఆంక్షలను, నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించి మెరుగైన రవాణా సౌకర్యానికి దోహదపడాలని రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ప్రజలను కోరారు. భక్తులు ఎటువంటి అసౌకర్యానికి లోను కాకుండా ఉండడానికే ట్రాఫిక్ నిబంధనలు విధించామని, నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే వివిధ మార్గాల్లో వచ్చే భక్తులు తమ వాహనాలను నిలిపి పోలీసు శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

