Top 5 This Week

Related Posts

ఖి‘లేడీ పురాణం’పై ఖమ్మం పోలీసుల హెచ్చరిక

ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఖమ్మం పోలీసులు అప్రమత్తతతో కూడిన ఓ హెచ్చరికను జారీ చేశారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాయమాటలతో కోట్ల రూపాయల మొత్తాన్ని కొల్లగొడుతున్న ఓ మాయలేడి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం జిల్లా పోలీసులు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో పలు హస్టళ్లు నడుపుతున్నామంటూ మాయ మాటలతో పరిచయం చేసుకుంటూ పురాణం శివకుమారి అనే మహిళ భారీ ఎత్తున మోసాలకు పాల్పడుతున్నట్లు ఖమ్మం రూరల్ సీఐ సత్యనారాయణరెడ్డి వెల్లడించారు.

నిత్యవసర సరుకులను కొనుగోలు చేస్తూ, ఖమ్మం పరిధిలో అప్పులు చేసి ఉడాయించిన సొమ్ము ఏకంగా రూ. ఐదు కోట్లకు పైగానే ఉంటుందన్నారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారంతో ఈ మహిళ మోసాలపై విచారణ చేపట్టినట్లు సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపారు.

విజయవాడకు చెందిన పురాణం శివకుమారి అనే మహిళ ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో అధిక మొత్తంతో నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్నట్లు వ్యాపారులను, రైతులను నమ్మించి మోసం చేసినట్లు సమాచారం ఉందన్నారు. ప్రజలు ఇటువంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

ఇదిలా ఉండగా పురాణం శివకుమారి అనే మహిళ సహా ఏడుగురు వ్యక్తులపై ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీసులు రెండు రోజుల క్రితమే కేసు నమోదు చేయడం గమనార్హం. ఆహార ఉత్పత్తుల వ్యాపారంలో పార్టనర్ షిప్ కల్పిస్తామని తనను మోసం చేసినట్లు కూసుమంచి మండలం పెరిగి సింగారానికి చెందిన గద్దె ఝాన్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.

తన నుంచి రూ.19.15 లక్షల నగదు తీసుకుని మోసం చేశారని ఝాన్సీ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పురాణం శివకుమారి సహా ఏడుగురు నిందితులపై కూసుమంచి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పురాణం శివకుమారి చేసిన మోసపు ఘటనల్లో బాధితులు కోల్పోయిన మొత్తం రూ. 5.00 కోట్ల వరకు ఉండవచ్చని, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం రూరల్ పోలీసులు కూడా హెచ్చరించడం గమనార్హం.

Popular Articles