నకిలీ బంగారంతో ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తుల ఫొటోలను ఖమ్మం నగర పోలీసులు శుక్రవారం విడుదల చేశారు. ఇక్కడ గల ఫోటోల్లో కనిపిస్తున్న నిందితులు నగరంలో తిరుగుతూ, దొరికిన బంగారు బిస్కెట్ తక్కువ ధరకే ఇస్తామంటూ నమ్మబలికి, నకిలీ బంగారంతో ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం త్రీ టౌన్ సీఐ మెహన్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు.
పథకం ప్రకారం ఓ అపరిచిత మహిళ ముందు వెళ్తూ ఆమె చేతిలోని ప్యాకెట్ జారవిడుస్తుందని, ఆపై ఆమే ఆ ప్యాకెట్ తెరిచి బంగారు బిస్కెట్ దొరికిందని చెబుతుండగా, మరో వ్యక్తి వచ్చి బంగారు బిస్కెట్ విలువ లక్షల్లో ఉంటుందని నమ్మిస్తారని సీఐ పేర్కొన్నారు. ఇదంతా నిజమేనని నమ్మిన ఓ బాధిత మహిళ తన వద్ద ఉన్న రెండు తులాల బంగారు గొలుసును, రూ.10వేల నగదును అపరిచిత మహిళకు ఇవ్వడమే కాక మిగతా నగదు తెచ్చి ఇస్తానని చెప్పి మోస పోయిందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ఫోటోలోని ఆయా నిందితులు ఎక్కడైనా కనిపిస్తే ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ సెల్ నెంబర్ 8712659115, డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

