ఖమ్మం సిటీ పోలీసులు మరో ‘రియల్టర్’పై ఛీటింగ్ కేసు నమోదు చేశారు. డబుల్ రిజిస్ట్రేషన్లు, లేని భూమి ఉన్నట్లు నమ్మించి మోసం చేస్తున్న ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ఇటీవలే పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితుల్లో తాజా ఘటన కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఖమ్మం టూ టౌన్ ఇన్స్‌పెక్టర్ బాలకృష్ణ కథనం ప్రకారం.. ఖమ్మం నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంకట నారాయణ హ్యాపీ హోమ్స్ పేరుతో ఓ వెంచర్ ను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల ప్రాంతంలో నాలుగు ఎకరాల భూమిలో హ్యాపీ హొమ్ అపార్టుమెంట్ పేరుతో అభివృద్ధి చేసి 24 నెలల్లో నిర్మించి ఇస్తామని ప్రజలను నమ్మించారు.
ఈమేరకు అగ్రిమెంట్ చేసి బాధితులను నమ్మించి ప్లాట్లకు డబ్బులు తీసుకుని మోసం చేసినందుకు వెంకట నారాయణపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం టూ టౌన్ ఇన్స్‌పెక్టర్ బాలకృష్ణ తెలిపారు. వెలుగుమట్ల ప్రాంతంలోని సర్వే నెంబర్ 546లో 2021 సంవత్సరంలో హ్యాపీ హొమ్ అపార్టుమెంట్ అభివృద్ధి పేరుతో డబ్బులు తీసుకొని మోసం చేశారన్నారు. బాధితుల్లో ఒకరైన ఖమ్మం రూరల్ మండలం ఏదులపూరానికి చెందిన మారుపాక వెంకట చారి ఇచ్చిన ఫిర్యాదు పై విచారణ జరిపి వెంకట నారాయణపై కేసు నమోదు చేసినట్లు సీఐ బాలకృష్ణ వివరించారు.

