Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

తీర్థాల జాతరలో పోలీస్ ‘రికార్డు’.. భద్రపర్చాల్సిందే..!

(సమీక్ష ప్రత్యేక కథనం)
ఖమ్మం జిల్లా తీర్థాల జాతరలో పోలీసుల ‘రికార్డు’ను ఎందుకు నిక్షిప్తం చేయాలనే అశంలోకి వెళ్లేముందు గత నెలాఖరులో జరిగిన మేడారం జాతరలో భక్తులు ఎదుర్కున్న ట్రాఫిక్ ఇబ్బందులను ఓసారి క్లుప్తంగా సమీక్షించుకుందాం. విశాలమైన రోడ్ల విస్తరణ, హన్మకొండ నుంచి తాడ్వాయి వరకు 90 కిలోమీటర్ల పొడవునా ఛత్తీస్ గఢ్ లోని జగదల్ పూర్ కు వెళ్లే జాతీయ రహదారి. అందులోనూ ములుగు వరకు 47 కి.మీ. వరకు నాలుగు లేన్లతో కూడిన రహదారి. పస్రా నుంచి మేడారం వరకు 26 కి.మీ., తాడ్వాయి నుంచి మేడారానికి 13 కి.మీ. వరకు డబుల్ రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికీ గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడిన స్థితి.

కేవలం 13 కి.మీ. జర్నీ చేయడానికి ఏడున్నర గంటల సమయం తీసుకున్న దుస్థితి. మేడారం నుంచి హన్మకొండ వెళ్లేందుకు పది నుంచి 12 గంటల సమయం తీసుకున్నట్లు భక్తుల ఆరోపణలు. మొత్తంగా ట్రాఫిక్ జామ్ కారణంగా ఈసారి మేడారం భక్తులు ప్రభుత్వ యంత్రాంగాన్ని, ముఖ్యంగా పోలీసులను నిందిస్తూ ఉస్సూరుమంటూ ప్రయాణించారనేది అంగీకరించాల్సిన అంశం. చివరికి వనదేవతలైన సమ్మక్క-సారలమ్మల దర్శనం సందర్భాంగానూ భక్తులు ప్రభుత్వ యంత్రాంగం పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఇందుకు కారణాలు అనేకం. జాతర నిర్వహణలోనేకాదు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలోనూ అధికారులు ఘోరంగా ఫెయిలయ్యారనే వ్యాఖ్యలు భక్తుల నుంచి వినిపించాయి.

తీర్థాల జాతరలో పోటెత్తిన భక్తజనం

మేడారం జాతరలో భక్తులు ఇంతటి తీవ్ర సమస్యలను ఎదుర్కోవడానికి గల అసలు కారణాలేమిటి? జాతర నిర్వహణలో అనుభవం గల అధికారులకు బాధ్యతలు అప్పగించకపోవడం. సింగిల్ హ్యాండ్ తో డీల్ చేయగలమనే కొందరు అధికారులు ఓవర్ కాన్ఫిడెన్స్.. గత జాతరల్లో విధులు నిర్వహించిన సీనియర్ అధికారులను విభాగాల వారీగా ఇంఛార్జిలుగా నియమించకపోవడం.. ఇత్యాది అంశాలు అనేకం ఇందులో దాగి ఉన్నాయి. మొత్తం మేడారం జాతరకు వచ్చిన కోట్లాది మంది భక్తులు ప్రభుత్వ యంత్రాంగం విధినిర్వహణ తీరుతెన్నులపై తమదైన తీరులో వ్యాఖ్యలు చేస్తూ తిరుగు ప్రయాణం చేశారనేది బహిరంగం.

కానీ ఖమ్మం జిల్లా తీర్థాల జాతరలో మాత్రం ఈసారి భక్తులు సజావుగా ప్రయాణం చేయడమే అసలు విశేషం. కోట్ల మంది భక్తులు హాజరైన మేడారం జాతరతో 3.50 లక్షల మంది హాజరైన తీర్థాల భక్తుల సంఖ్యతో బేరీజు వేస్తున్న అంశంగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేడారం జాతరలో కల్పించిన సౌకర్యాలు, కేటాయించిన వందల కోట్ల నిధుల వంటి కీలకాంశాలను కూడా ఇక్కడ పరిగణనలోకి తీసుకోవలసిన అవసరముంది. ఇరుకైన రహదారులు, లక్షల కొద్దీ భక్తులు హాజరైన తీర్థాల జాతర బుధవారం ముగిసింది. కానీ ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకపోవడమే ఇక్కడ అసలు విశేషం. అందుకే తీర్థాల జాతరలో ఇది పోలీస్ ‘రికార్డు’గా అభివర్ణించవచ్చు.

తీర్థాల సంగమేశ్వరస్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులు

మహాశివరాత్రి సందర్భంగా నాలుగు రోజులపాటు నిర్వహించే తీర్థాల జాతరలో ట్రాఫిక్ జామ్ కావడమనేది సర్వసాధారణం. ప్రతి జాతరలోనూ ట్రాఫిక్ జామ్ ఏర్పడి, కదలని వాహనాలతో భక్తులు పోలీసుల పనితీరును తిట్టుకుంటూ వెళ్లడం కూడా సహజంగా మారేది. కానీ ఈసారి అందుకు విరుద్ధంగా ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఖమ్మం రూరల్ పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోవడం విశేషం. ఖమ్మం-కామంచికల్ మార్గంలో స్వల్ప అంతరాయం మినహా, గోళ్లపాడు ప్రధాన మార్గంలోనేగాక, మరే ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడిన దాఖలాలు లేవు. మొత్తంగా ఈసారి తీర్థాల జాతరలో ట్రాఫిక్ జామ్ కాకుండా పకడ్బందీ పార్కింగ్ ప్రదేశాలు, మార్గాల ఎంపిక, తిరుగు ప్రయాణపు రూట్ల మ్యాప్ పోలీసుల పనితీరుపై ప్రశంసలను కురిపించిందనే చెప్పాలి.

ఈ నేపథ్యంలో తీర్థాల జాతరలో ట్రాఫిక్ జామ్ లేకుండా మొన్నటి శివరాత్రి సందర్బంగా అమలు చేసిన ప్రణాళికను, రాకపోకల మార్గాల ప్రణాళికను పోలీసులు ‘రికార్డు’ పరంగా భద్రపర్చాల్సిన అవసరముంది. ఇది మున్ముందు నిర్వహించే జాతరలకు మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మేడారం జాతరలో ఈ తరహా ‘రికార్డు’ను భద్రపర్చని కారణంగానే విశాలమైన రోడ్లు ఉన్నప్పటికీ, గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏరపడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి

కాగా తీర్థాల జాతరలో రెండు షిఫ్టుల్లో మొత్తం 10 మంది సీఐలు, 25 మంది ఎస్ఐలు, 250 మంది పోలీసులు విధులు నిర్వహించారని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి వెల్లడించారు. ఈసారి జాతర వరకు కేవలం ద్విచక్ర వాహనాలను, కార్లను మాత్రమే అనుమతించినట్లు చెప్పారు. దీంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదన్నారు. అంతేగాక స్వామివారి దర్శనానికి ఎటువంటి వీఐపీ పాసులు కూడా జారీ చేయలేదన్నారు. వీటికితోడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈసారి రూ. 10.00 లక్షల మొత్తపు ఉత్సవ నిధులు ఇచ్చారని, ఆయా డబ్బును భక్తులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించడానికి దోహదపడ్డాయని చెప్పారు. తీర్థాల జాతరలో ట్రాఫిక్ జామ్ కాకుండా విధులు నిర్వహించిన సీఐలను, ఎస్ఐలను, పోలీసులను ఏసీపీ తిరుపతిరెడ్డి ఈ సందర్భంగా అభినందించారు.

Popular Articles