ఫోర్జరీ ష్యూరిటీ డాక్యుమెంట్ల అభియోగంపై నమోదైన కేసులో అరెస్టయిన అడ్వకేట్, ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఎస్ కె లతీఫ్ ను ఖమ్మం నగర పోలీసులు ఆరో నిందితునిగా చూపారు. రఘునాధపాలెం మండలం ఉప్పలచెలక గ్రామ పంచాయతీ కార్యదర్శి వాంకుడోత్ రవితేజ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నెం. 186/2025 ద్వారా నమోదు చేసిన కేసులో నిందితులపై పోలీసులు బీఎన్ఎస్ చట్టంలోని 61(2), 336(2), 336(3), 337, 340(2), 341 (2) సెక్షన్ల కింద అభియోగం మోపారు.
కేసులో మొత్తం ఏడుగురిని నిందితులుగా పోలీసులు పేర్కొనగా, అందులో వరుసగా A1 నుంచి A3 వరకు క్రైం నెం. 264/2024 ద్వారా నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుకు సంబంధించి ఖమ్మం జిల్లా జైలులో ఉన్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా A4గా బానోత్ భరత్, A5గా నూనావత్ రవి, A6గా అడ్వకేట్ లతీఫ్, A7గా పొట్లపల్లి సురేష్ లను చూపారు.
కేసులో ఆరో నిందితుడైన అడ్వకేట్ లతీఫ్ ను ఈ ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఖమ్మంలోని కవిరాజనగర్ లో గల అతని ఇంటివద్ద అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఫోర్జరీ ష్యూరిటీల ద్వారా నిందితులు కోర్టును మోసగించినట్లు పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అడ్వకేట్ లతీఫ్ ను కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ విడుదల చేసినట్లు పోలీసు వర్గాలు చెప్పాయి.

