Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

గంజాయి రవాణా నిందితులపై ఖమ్మం పోలీసుల పీడీ యాక్ట్ పంజా

గంజాయిని అక్రమంగా రవాాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులపై ఖమ్మం రూరల్ పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు. కూసుమంచి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనలో ఇద్దరు గంజాయి రవాణాదారులపై పీడీ యాక్టును అమలు చేసినట్లు ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి మంగళవారం రాత్రి ప్రకటించారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని బోడుప్పల్ బుద్దనగర్ లో ఉంటున్న సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మందపల్లికి చెందిన పల్లపు రఘు (36), నల్లగొండ జిల్లా మిర్యాగూడెం మండలం వెంకటాద్రిపాలేనికి చెందిన మహ్మద్ ఖాజా పాషా(29)లపై పీడీ యాక్టును అమలు చేసినట్లు చెప్పారు.

కూసుమంచి మండలం చేగొమ్మ క్రాస్ రోడ్డు వద్ద కూసుమంచి పోలీసులు వాహనాలు సోమవారం రాత్రి తనిఖీ చేస్తుండగా ఆయా ఇద్దరు వ్యక్తులు గంజాయి రవాణా చేస్తూ పట్టుబడినట్లు రూరల్ ఏసీపీ చెప్పారు. రఘు, మహ్మద్ ఖాజాపాషా పయనిస్తున్న కారును తనిఖీ చేయగా 89 లక్షల విలువైన 179 కిలోల గంజాయి లభ్యమైనట్లు చెప్పారు. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న రఘు, ఖాజా పాషాలను అరెస్ట్ చేసి, పీడీ యాక్టును అమలు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ తిరుపతిరెడ్డి వివరించారు. పీడీ యాక్టు అమలు పత్రాలను కూసుమంచి సీఐ సంజీవ్ కుమార్, నేలకొండపల్లి ఎస్ఐ సంతోష్ కుమార్ లు చంచల్ గూడ జైలు అధికారులకు అందజేసినట్లు ఏసీపీ చెప్పారు.

Popular Articles