ఖమ్మం: ఉడతనేని వికాస్ చౌదరి గుర్తున్నాడు కదా..? ఖమ్మం జిల్లా పోలీసుల సత్తాకు సవాల్ విసురుతూ తప్పించుకుతిరుగుతున్న సైబర్ నేరాల కేసులో అత్యంత కీలక నిందితుడే వికాస్ చౌదరి. ఇతని గ్యాంగ్ దోపిడీ పర్వంలో అరెస్టుల పర్వం ఇంకా ముగింపునకు రాకముంటే లావిష్ చౌదరి అనే మరో వ్యక్తి దోపిడీ కథ తెరపైకి వచ్చింది. వికాస్ చౌదరి దోపిడీ కథలో ఉద్యోగాలు వస్తాయనే ఆశతో బ్యాంక్ అకౌంట్లు ఇచ్చినందుకు 17 మంది స్థానికులు కేసులపాలై, అరెస్టయి జైలు ఊచలు లెక్కిస్తుండగా, లావిష్ చౌదరి ఛీటింగ్ దందాలో స్థానిక గిరిజనులు పలువురు అరెస్ట్ కావలసవి వచ్చింది. వికాస్ చౌదరి అండ్ గ్యాంగ్ హైదరాబాద్ కేంద్రంగా తమ దందాను నిర్వహించగా, లావిష్ చౌదరి మాత్రం దుబాయ్ సెంటర్ గా ఛీటింగ్ నేరాలకు పాల్పడినట్లు ఖమ్మం జిల్లా పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇంతకీ ఎవరీ లావిష్ చౌదరి అంటే.. పోలీసుల కథనం ప్రకారం.. బాట్ బ్రో (BotBro) అనే కంపెనీ వ్యవస్థాపకుడు. దుబాయ్ లో ఉండే లావిష్ చౌదరి ఢిల్లీకి చెందిన గంజేంద్రసింగ్, దీపక్ యాదవ్, ప్రిన్స్ గుప్తా, సందీప్ నర్వాల్, ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ కు చెందిన యశ్ దేవ్ షైనీ, చండీగఢ్ కు చెందిన ప్రమోద్ మౌర్య, వికాస్ మౌర్య, పంజాబ్ కు చెందిన వివేక్ పటాన్ అనే వ్యక్తులు కూడా బ్రాట్ బ్రో కంపెనీ ఛీటింగ్ బాగోతంలో అరెస్ట్ కావలసిన కీలక నిందితులుగా పోలీసులు ప్రకటించారు.
బ్రాట్ బ్రో కంపెనీ ద్వాారా లావిష్ చౌదరి అండ్ గ్యాంగ్ దుబాయ్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. లావిష్ చౌదరి ప్రధాన సూత్రధారిగా నడుస్తున్న ఈ కంపెనీ ప్రభుత్వ నియంత్రణలేని డిపాజిట్ స్కీమ్ ల ద్వారా కోట్ల రూపాయాలను పెట్టుబడులుగా సేకరించి, నెలకు 9 నుంచి పది శాతం లాభాలు వస్తాయని హామీ ఇస్తుంది. ఆయా వ్యక్తులు తరచూ పేర్లు, ప్లాట్ ఫారాలు మారుస్తూ అక్రమంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీములు, అనధికార ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్ ఫారాల ద్వార ప్రజల నుంచి భారీ పెట్టుబడులను సేకరిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.

ఈ తరహా మోసాలకు దుబాయ్ కేంద్రంగా లావిష్ చౌదరి ఏర్పాటు చేసిన BotBro / BOTALFA), మైన్ క్రిప్టో, YFX (Yorker FX), QFX, BITNOVA వంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ ప్టాట్ ఫారాల ద్వారా అమాయక ప్రజలనుంచి పెట్టుబడులను సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. తద్వారా ప్రజలను మోసం చేసేందుకు స్థానికంగా ఏజెంట్లను నియమించుకున్నారు. బాట్ బ్రో కంపెనీతోపాటు దాని ఏజెంట్లు ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో నెలకు ఖచ్చితంగా లాభాలు వస్తాయని హామీ ఇచ్చి పెట్టుబడిదార్లను మోసం చేశారు.
ఈ తరహా అభియోగాలపైనే లావిష్ చౌదరి వ్యవస్థాపకునిగా ఏర్పాటైన బాట్ బ్రో కంపెనీకి ఏజెంట్లుగా పనిచేసిన వ్యక్తులు రూ. 2.73 కోట్ల మొత్తాన్ని సంపాదించి, ఆయా డబ్బుతో తమ కుటుంబ సభ్యుల పేర్లపై ఆస్తులు కొనుగోలు చేసినట్లు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. ఈ నేపథ్యంలో ఆయా ఆస్తులను అటాచ్ చేయనున్నట్లు కూడా పోలీసులు ప్రకటించారు. లావిష్ చౌదరి కంపెనీకి తెలంగాణాలో ప్రధాన ఏజెంట్లుగా పనిచేసిన వారిని ఈ కేసులో నిందితులుగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్టయినవారిలో కారేపల్లికి చెందిన భూక్యా శ్రీధర్ నాయక్, కైకొండాయిగూడేనికి చెందిన తేజావత్ ఉపేందర్, నీలకంఠం సిద్ధు, కారేపల్లి మండలం భిక్యాతండాకు చెందిన వాంకుడోత్ సురేష్ అనే వ్యక్తులు ఉన్నారు. లావిష్ చౌదరి కంపెనీకి ప్రధాన ఏజెంట్లుగా వ్యవహరించిన ఆయా వ్యక్తులతోపాటు మరికొందరిని కూడా పోలీసులు నిందితులుగా గుర్తించారు. లావిష్ చౌదరి సహా మరో పది మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు ప్రకటించారు. ఈ కేసులో ఇతర ఏజెంట్లను కూడా గుర్తించడంతోపాటు విదేశాల్లో గల సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు నగర ఏసీపీ రమణమూర్తి చెప్పారు.
కాగా ఇటువంటి ఛీటింగ్ పెట్టబడుల అంశంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రజలకు సూచించారు. పెట్టుబడులు పెట్టేముందు సంబంధిత స్కీంల విశ్వసనీయతను పరిశీలించాలని కోరారు. అధిక లాభాలు ఇస్తామని చెప్పే ఆఫర్లకు మోసపోవద్దని, అనుమానాస్పద పెట్టుబడవి పథకాల వివరాలను పోలీసులకు తెలపాలని సీపీ సునీల్ దత్ ప్రజలను కోరారు.

