Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

హైవేపై ఘర్షణ ఘటనలో ఏడుగురి అరెస్ట్

ఖమ్మం-రాజమండ్రి హైవేపై ఘర్షణకు పాల్పడిన ఘటనలో నగర పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఈమేరకు నగర ఏసీపీ రమణమూర్తి ఓ ప్రకటన విడుదల చేశారు. మద్యం మత్తులో ఇరువర్గాలు రెచ్చిపోయి పరస్పర దాడులకు తెగబడిన ఈ ఘటనలో మొత్తం 11 మందిపై కేసులు నమోదు చేసి, ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన పూర్వాపరాలను ఏసీపీ ఈ సందర్భంగా వివరించారు.

ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాలపురంలో మద్యం తాగిన మత్తులో రాకేష్ అనే వ్యక్తి రోడ్డుపై అడ్డంగా పడుకోవడంతో అతని భార్య దుర్గా భవానితో సమీపంలో దుకాణం నడుపుతున్న కవిత, వేణుగోపాల్ వారించడంతో గొడవ మొదలైందన్నారు. ఈ గొడవకు పాత కక్షలు కూడా తోడు కావడం, కొంతమంది ఆకతాయిలు జత కావడంతో పరస్పరం దాడులు చేసుకున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆకతాయిల బ్యాచ్ పెట్రోల్ తెచ్చి షాపు ఎదుట వున్న వస్తువులపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిగా పక్కన పార్క్ చేసిన స్కూటీ పాక్షికంగా తగలబడిందని ఏసీపీ తెలిపారు.

దాడులకు పాల్పడిన ఘటనకు సంబంధించి పరస్పరం ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకోగా, ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి విచారణ అనంతరం ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించామన్నారు. మరో ఇద్దరు హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారని, ఇంకో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఏసీపీ రమణమూర్తి వివరించారు. రుడావత్ దుర్గా భవానీ ఫిర్యాదుపై A1 గోపాల్, A2 వేణు,A3 వినోద్,A4 లక్ష్మి, A5 కవితలపై, బానోత్ వేణు ఫిర్యాదుపై నమోదైన కేసులో A1 రాకేష్,A2 శ్రీనాధ్, A3 మహేష్ A4 ఉమేష్,A5 వరుణ్ తేజ,A6 కార్తీక్ లపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తులు

కాగా మాదక ద్రవ్యాలు ఏమైనా స్వీకరించారా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు గంజాయి కిట్ ద్వారా నిందితులందరికీ మూత్ర పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. ఘర్షణకు దిగినవారిలో నిందితులెవరూ గంజాయి. మాదక ద్రవ్యాలు తీసుకోలేదని నిర్ధారణ జరిగినట్లు చెప్పారు. గంజాయి తీసుకునే వ్యక్తుల స్థితిని 15 రోజుల వరకు మూత్ర పరీక్షలలో తెలుసుకునే అవకాశం వుంటుందని ఏసీపీ ఈ సందర్బంగా తెలిపారు. ఇటువంటి ఘటనలు జరిగిన సందర్భాల్లో ఎలాంటి ఆధారాలు, నిర్ధారణ లేకుండా గంజాయి మత్తులో దాడులు చేశారని, సంబంధిత పోలీస్ అధికారుల వివరణ లేకుండా పత్రికల్లో ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ఏసీపీ రమణమూర్తి ఈ సందర్భంగా సూచించారు.

Popular Articles