Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

దొంగల వెంకన్న ముఠా.. వెరీ డేంజరస్!

ఖమ్మం జిల్లా వైరా పోలీసులు అరెస్టు చేసిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠా నేర చరిత్ర పుటలు పుటలుగా ఉంది. గత నెల 12వ తేదీన వైరా పట్టణంలో ఉదయం 11 గంటల ప్రాంతంలోనే ఓ వృద్ధురాలిని బంధించి బంగారు నగలను దోపిడీ చేసిన ముఠా సభ్యులు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నేర చరిత్ర, వైరాలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మంగళవారం మీడియా సమావేశంలో వివరించారు.

స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తును పరిశీలిస్తున్న సీపీ సునీల్ దత్

సోదా పేరుతో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంట్లోకి ప్రవేశించి ఆమె కాళ్లూ, చేతులను, నోటిని ప్లాస్టర్ తో చుట్టి, అరిస్తే చంపేస్తామంటూ బెదిరించి బెడ్ మీదకి పడేశారు. ఆ తర్వాత ఇంట్లో గల బీరువాను తెరిచి డబ్బు, బంగారం సహా వృద్ధురాలి ఒంటిమీద ఉన్నటువంటి రూ. 7.45 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకుని దుండగులు పారిపోయారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజీ, దుండగులు ఉపయోగించిన కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా వారి ఆచూకీని కనుగొన్నారు. మొత్తం నలుగురు దుండగుల్లో ఇద్దరు గుంటూరుకు, మరో ఇద్దరు తమిళనాడు రాష్ట్రానికి చెందినవారుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నెమలి-దాచాపురం అంతర్ రాష్ట్ర చెక్ పోస్టు వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా ఈ ముఠా పట్టుబడడం గమనార్హం.

దుండగుల వద్ద లభ్యమైన మారణాయుధాన్ని పరిశీలిస్తున్న సీపీ సునీల్ దత్

వాహన తనిఖీలో అనుమానాస్పదంగా కనిపించిన నలుగురు వ్యక్తులను పట్టుకుని విచారించగా, గతనెల 12వ తేదీన జరిగిన దోపిడీ ఘటనలో నిందితులుగా తేలింది. వీరిని గుంటూరుకు చెందిన రాయపాటి వెంకయ్య@ వెంకన్న@దొంగల వెంకన్న, దాచేపల్లి మండలం నారాయణపురానికి చెందిన షేక్ నాగుల్ మీరా, తమిళనాడుకు చెందిన ముత్తు@ముత్తురాజా మురుగేషన్, విజయ్ @ విజయ్ కుమార్ గా గుర్తించారు.

ఇదీ దుండగుల నేరచరిత్ర:
నలుగురు సభ్యుల ఈ ముఠా తెలంగాణా, ఏపీ, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో అనేక ఆర్థిక, హత్యా నేరాలకు పాల్పడింది. రాయపాటి వెంకయ్య@దొంగల వెంకన్నపై 30 కేసులు, షేక్ నాగుల్ మీరాపై 10, ముత్తు@ముత్తురాజ మురుగేషన్ పై 11, విజయ్@విజయ్ కుమార్ పై 4 కేసుల చొప్పన ఆయా రాష్ట్రాల్లో ఉన్నాయి.

ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న కార్లు

వైరాలో చోరీ చేసిన తర్వాత ఈ ముఠా కర్నాటకలోని చెల్లకేరు సమీపంలో కూడా ఇంట్లోకి ప్రవేశించి బంగారు ఆభరణాలను దొంగిలించారు. ఈ కేసులోనూ చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మీడియాకు వివరించారు. విలేకరుల సమావేశంలో వైరా ఏసీపీ రహమాన్, సీఐ ఎన్. సాగర్, ఎస్ఐ సహా పోలీసుల సిబ్బంది కూడా పాల్గొన్నారు.

Popular Articles