పేదల బతుకుదెరువు సమస్యపై ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య కరుణ చూపారు. కుమ్మరుల సమస్య పట్ల ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో కుమ్మరుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సమస్యను అర్థం చేసుకుని స్పందించిన కమిషనర్ మంచి మనసుకు కుమ్మరులు ఉప్పొంగిపోవడం విశేషం. వివరాల్లోకి వెడితే..
కొన్నేళ్లుగా ఖమ్మం నగరంలోని ఇల్లందు క్రాస్ రోడ్డులో కుండలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్న తమను ట్రాఫిక్ కు విఘాతం కలుగుతుందనే పేరుతో గత పదిరోజుల క్రితం టీడీపీ ఆఫీసు సమీపంలోని వెజ్ అండ్ నాన్ వెజ్ సమీకృత మార్కెట్ కి తరలించారని కుమ్మరులు వాపోయారు. కానీ అక్కడ వ్యాపారం సరిగ్గా సాగడం లేదని, ఇదే జీవనంగా బతుకుతున్న తమను ఆదుకోవాలని కోరుతూ శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ తరపున పద్మశీ వనజీవి రామయ్య ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యను శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా స్పందించిన కమిషనర్ పటేల్ స్టేడియానికి అనుకుని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న రైతు మార్కెట్ దగ్గర స్థలంలో కుండలు అమ్ముకోడానికి అనుమతి ఇస్తామని హామీ ఇచ్చారు. అక్కడ వారి వ్యాపారం నిర్వహించుకోవచ్చని సూచించారు.

దీంతో కుమ్మరులు హర్షం వ్యక్తం చేస్తూ తమ సమస్యకు వెంటనే పరిష్కారం చూపిన కమిషనర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ బాధ్యులు తిగుళ్ల వెంకటరమణ, కానుగుల రాధాకృష్ణ, నాంపల్లి పాపారావు, ఖమ్మంపాటి రమేష్, కోళ్లూరి పరుశురాములు, దరిపల్లి కిరణ్, చేతరాజుపల్లి చంద్రశేఖర్, కొత్తపల్లి సరవయ్య, ప్రకాశ్ నగర్ కు చెందిన కుమ్మరులు పాల్గొన్నారు.