Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

మీడియాతో ఖమ్మం ఎంపీ ఆత్మీయ సమావేశం

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాం రెడ్డి చెప్పారు. ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన మీడియా ప్రతినిధుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురాంరెడ్డి మాట్లాడుతూ, తమది మొదట్నుంచీ ప్రజలతో ముడిపడిన జీవితమని చెప్పారు. మున్నేరు వరదలు సంభవించినపుడు కరుణగిరి, బొక్కల గడ్డ, జలగం నగర్, ఖమ్మం రూరల్ మండలాల్లోని గ్రామాల్లో విస్తృతంగా సహాయక చర్యలు చేపట్టానని తెలిపారు. యాభై దఫాలకు పైగా కలెక్టర్ తో చర్చించానని గుర్తు చేశారు. ప్రజలకు నిత్యావసర సరుకులు, గ్యాస్ స్టవ్ లు, దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేసినట్లు తెలిపారు.

జిల్లా అభివృద్ధి లక్ష్యంగా జాతీయ రహదారులు, సర్వీస్ రోడ్లు, అండర్ పాసుల రూపకల్పనకు కృషి చేసినట్లు చెప్పారు. కేంద్ర రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఇటీవలే పొన్నెకల్లు నుంచి ధంసలాపురం వరకు సర్వీస్ రోడ్డు, అండర్ పాస్ మంజూరు చేయించినట్లు వివరించారు. అదేవిధంగా కొత్తగూడెం విమానాశ్రయానికి సంబంధించి పార్లమెంటులో 377 నిబంధన కింద మాట్లాడినట్లు తెలిపారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో 8 సార్లు సమావేశమై కదలిక తీసుకొచ్చానని చెప్పారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ నుంచి ప్రత్యేక బృందం వచ్చి 950 ఎకరాల సర్వే చేసిందని వివరించారు.

పాలేరు నియోజకవర్గంలోని అత్యంత ఖరీదైన భూముల్లోంచి రైల్వే లైన్ వెళ్తే రైతులు తీవ్రంగా నష్టపోతుండడంతో రైల్వే జీఎం, కేంద్ర రైల్వే శాఖ మంత్రిని పలు మార్లు కలిసి ప్రత్యామ్నాయంగా పాపటపల్లి వెన్నారం, వయా మన్నెగూడెం మరిపెడ రైల్వే లైను సూచించినట్లు తెలిపారు. తల్లాడ అటవీ రేంజ్ పరిధి కనక గిరి అడవుల్లో పులి గుండాల ఎకో టూరిజం పార్కు కోసం కృషి చేస్తున్నట్టు ఎంపీ తెలిపారు. జిల్లాకు సంబంధించి అనేక అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులతో, ఎమ్మెల్యేలతో సమన్వయంతో పని చేస్తున్నానని, తనకు ఎవరితోనూ ఎటువంటి విభేదాలు లేవని రఘురాంరెడ్డి విలేకరులు అడిగిన ఓ ప్రశ్నలు సమాధానంగా చెప్పారు.

Popular Articles