ఖమ్మం: హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘స్వతంత్ర’ న్యూస్ ఛానల్ కు ఖమ్మం డిప్యూటీ లేబర్ కమిషనర్ కోర్టు గురువారం జరిమానా విధించింది. అంతేగాక సంస్థలో పనిచేసిన జర్నలిస్టుకు ఎగవేసిన వేతనపు మొత్తాన్ని కూడా చెల్లించాలని ఆయా న్యూస్ ఛానల్ యాజమాన్యాన్ని ఆదేశిస్తూ ఖమ్మం లేబర్ కోర్టు డిప్యూటీ కమిషనర్ కె. విజయభాస్కర్ రెడ్డి తీర్పునిచ్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
స్వతంత్ర న్యూస్ ఛానల్ లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధిగా పనిచేసిన ఎడమ సమ్మిరెడ్డికి ఆ సంస్థ క్రమపద్ధతిలో వేతనం చెల్లించలేదు. తాను పనిచేసిన కాలానికి వేతనం చెల్లించాలని సమ్మిరెడ్డి అనేకసార్లు యాజమాన్యానికి, దాని ప్రతినిధులకు విన్నవించుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీంతో తనకు న్యాయం చేయాలని జర్నలిస్ట్ ఎడమ సమ్మిరెడ్డి ఖమ్మంలోని డిప్యూటీ లేబర్ కమిషనర్ కోర్టును ప్రముఖ న్యాయవాది కె. రాజశేఖర్ రెడ్డి ద్వారా ఆశ్రయించారు. వేతనాల చెల్లింపు చట్టం 1936 ప్రకారం ఖమ్మ లేబర్ కోర్టులో కేసు దాఖలు చేశారు. కేసు విచారణలో భాగంగా తన క్లయింట్ సమ్మిరెడ్డి స్వతంత్ర న్యూస్ ఛానల్ లో పనిచేసినట్లు, పనిచేసిన కాలానికి మొత్తం వేతనాన్ని పొందలేదని, యాజమాన్యం ఎగవేసిందని పేర్కొంటూ న్యాయవాది రాజశేఖర్ రెడ్డి వాదించారు.
కేసు పూర్వాపరాలను పరిశీలించి, విచారణ జరిపిన అనంతరం ఖమ్మం లేబర్ కోర్టు డిప్యూటీ కమిషనర్ కె. విజయభాస్కర్ రెడ్డి స్వతంత్ర న్యూస్ ఛానల్ యాజమాన్యానికి జరిమానా విధిస్తూ, జర్నలిస్టుకు బకాయి పడిన వేతనం మొత్తాన్ని నెలరోజుల్లోగా చెల్లించాలని తీర్పునిచ్చారు. జర్నలిస్ట్ సమ్మిరెడ్డి పనిచేసిన కాలంలో చెల్లించని రూ. 1,17,600 మొత్తానికి రూ. 3,000 జరిమానాను కలుపుకుని రూ. 1,20,600 మొత్తాన్ని నెలరోజుల వ్యవధిలో డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) ద్వారా చెల్లించాలని ఖమ్మం లేబర్ కోర్టు డిప్యూటీ కమిషనర్ కె. విజయభాస్కర్ రెడ్డి తన తీర్పులో ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా ఆయా మొత్తాన్ని యాజమాన్యం చెల్లించని పక్షంలో ఏడాదికి 6 శాతం వడ్డీని కూడా చెల్లించాల్సి ఉంటుందని డీసీఎల్ విజయభాస్కర్ రెడ్డి తన తీర్పులో ప్రస్తావించారు.
కాగా ఈ తీర్పుపై సీనియర్ జర్నలిస్ట్ ఎడమ సమ్మిరెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ, ఉద్యోగులతో పనిచేయించుకుని వేతనాలు ఎగవేసే మీడియా యాజమాన్యాలకు ఖమ్మం లేబర్ కోర్టు ఇచ్చిన తీర్పు ఓ గుణపాఠమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తన తరపున కనీస ఫీజు కూడా తీసుకోకుండా వాదించిన న్యాయవాది కె. రాజశేఖర్ రెడ్డికి సమ్మిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

