సర్వే పేరుతో దోపిడీలకు, దొంగతనాలకు పాల్పడుతున్న కరడుగట్టిన దొంగల ముఠాను ఖమ్మం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సరిగ్గా నెల రోజుల క్రితం.. గత నెల 12వ తేదీన వైరా పట్టణంలోని లీలా సుందరయ్య నగర్ లో జరిగిన ఓ దోపిడీ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. సర్వే పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన నలుగురు ఆగంతకుల ముఠా వృద్ధురాలిపై దాడి చేసి బంధించడం ద్వారా రూ. 15 లక్షల విలువైన 18 తులాల బంగారు ఆభరణాలను దోచుకువెళ్లారు. ఉదయం 11 గంటల ప్రాంతంలోనే జరిగిన ఈ దోపిడీ ఉదంతం తీవ్ర కలకలం రేపింది.
ఈ దోపిడీ సంఘటనను సవాల్ గా తీసుకున్న వైరా పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపారు. మొత్తం ఐదుగురు సభ్యులు గల అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఠాలో ముగ్గురు చెన్నయ్, మిగతా ఇద్దరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన దొంగలుగా సమాచారం. ఈ ముఠాపై రెండు హత్య కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు కనుగొన్నట్లు తెలిసింది. దోపిడీల్లో, దొంగతనాల్లో తమకు శిక్షణనిచ్చిన వారిని సైతం ఈ ముఠా హత్య చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక తదితర రాష్ట్రాల్లో జరిగిన అనేక దోపిడీలు, దొంగతనాలతో ఈ ముఠాకు సంబంధమున్నట్లు తెలుస్తోంది. అంతర్ రాష్ట్ర నేరస్థుల మఠాకు చెందిన ఈ దొంగలకు సంబంధించిన పూర్తి వివరాలను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఈ ఉదయం 11 గంటలకు వైరా పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు.