బతికి ఉన్న మనిషిని బతికే ఉన్నట్లు సర్టిఫికెట్ తీసుకురావాలని అధికారులు కోరడం పాత సంగతి.. కానీ బతికి ఉన్న వ్యక్తికి చనిపోయినట్లు సర్టిఫికెట్ ఇవ్వడం రెవెన్యూ శాఖ లీలల్లో సరికొత్త సిత్రం. జీవించి ఉన్న తమ కూతురు బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే ‘డెత్’ సర్టిఫికెట్ ఇచ్చిన ఖమ్మం జిల్లా కూసుమంచి రెవెన్యూ అధికారుల తీరుపై బాధిత కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సంబంధిత కుటుంబం కథనం ప్రకారం.. వివరాల్లోకి వెడితే..
కూసుమంచి మండలం మండలంలోని గట్టుసింగారం గ్రామానికి చెందిన కడారి ఉపేందర్, మమత దంపతులు మాద విద్య అనే తమ కూతురు జనన ధ్రువీకరణ పత్రం (బర్త్ సర్టిఫికెట్) కోసం పుట్టిన ఆరునెలల తర్వాత దరఖాస్తు చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డులు లేనందున తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కార్యదర్శి చెప్పారు. దీంతో బాలిక తల్లి,తండ్రులు గత డిసెంబరు 17న బాలిక బర్త్ సర్టిఫికెట్ కోసం కూసుమంచి తహశీల్దార్ కార్యాలయంలో చలానా కట్టారు. అప్పటినుంచి జతపర్చిన ధృవీకరణ పత్రాలు సరిగా లేవంటూ రెవెన్యూ అధికారులు కాలయాపన చేశారు. ఈ పరిణామాల్లోనే మొత్తానికి ఈనెల నాలుగో తేదీన సర్టిపికెట్ చేతికందించారు.

అయితే బాలిక తల్లి తన కూతురు బర్త్ సర్టిఫికెట్ ను పరిశీలించి కంగారు పడిపోయింది. బర్త్ సర్టిఫికెట్ బదులు డెత్ సర్టిఫికెట్ జారీచేసినట్లు గమనించి, ఇదేంటని ప్రశ్నించడంతో వెంటనే లాక్కొన్న సెక్షన్ ఆఫీసర్ దానిని చింపివేశారని బాలిక తల్లి మమత చెబుతున్నారు. ఆ తర్వాత ఇచ్చిన సర్టిఫికెట్ లోనూ డెలివరీ ప్రదేశపు వివరాలు లేకపోవడంతో రెెవెన్యూ అధికారుల వ్యవహార తీరుపై బాధిత కుటుంబం మండిపడుతోంది. ఈ ఘటనపై తహశీల్దార్ రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ, బాలిక తల్లితండ్రులు ఫోన్లో విషయం తన దృష్టికి తీసుకవచ్చారని తెలిపారు. పొరపాటు జరిగితే సవరింపులతో బర్త్ సర్టిఫికెట్ తిరిగి జారీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
