ఖమ్మం: గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల నుంచి తప్పించుకునేందుకు ఖమ్మం జిల్లాలలో కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎన్నికల శిక్షణా కార్యక్రమానికి డుమ్మా కొట్టిన పది మంది అధికారులపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆగ్రహించి కొరడా ఝళిపించారు. ఈమేరకు ఆయా అధికారులకు సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి పది మంది అధికారులు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా గైర్హాజరయ్యారు. ఈ పరిణామంపై జిల్లా కలెక్టర్ అనుదీప్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్నికల విధులు చాలా కీలకమని, వీటిని సరిగ్గా చేసేందుకు సిబ్బందిని సన్నద్దం చేసేందుకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశామన్నారు.
అయితే శిక్షణా తరగతులకు హాజరు కాని 10 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరిపై ఎందుకు కఠిన చర్యలు ఎందుకు తీసుకోకూడదో వెంటనే సమాధానం ఇవ్వాలని కలెక్టర్ ఆయా పది మంది అధికారులను ఆదేశించారు. ఈ తాఖీదుల అంశం జిల్లా అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

