Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

యూరియా కొరతపై ఖమ్మం కలెక్టర్ కీలక ప్రకటన

ఎరువుల కొరత, ముఖ్యంగా యూరియా లభ్యతపై ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కీలక ప్రకటన చేశారు. జిల్లాలో కావాల్సినంత ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడా ఎరువుల కొరత లేదని పేర్కొన్నారు. ఎక్కడైనా ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే, అధిక ధరలకు అమ్మకం జరిపితే చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ హెచ్చరించారు. సింగరేణి మండలం కారేపల్లిలోని విశాల సహకార పరపతి సంఘం ఫెర్టిలైజర్స్ సేల్ పాయింట్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల విక్రయాలకు సంబందించిన రికార్డులను పరిశీలించారు. ప్రతీ రైతుకి ఎన్ని బస్తాల యూరియా ఇస్తున్నారో పరిశీలించి వారి భూమి వివరాల లెక్కలు చూశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, ప్రస్తుతం పంట వేసిన రైతులకి పంటకు అవసరమైన యూరియా మాత్రమే సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ఎవరికైనా ఎక్కువ మొత్తంలో యూరియా బస్తాలు పంపిణి చేసినట్లయితే ఆ సొసైటీ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో ఆగస్టు నెలకు సరిపడా ఎరువులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని, యూరియాకు ఎటువంటి కొరత లేదని, రైతులు అనవసర ఆందోళన చెందవద్దన్నారు. ఆగస్టులో కూడా జిల్లాకు యూరియా సరఫరా ఉంటుందని, రైతులు అవసరానికి మించి యూరియాను కొనుగోలు చేయవద్దన్నారు.

ఎరువుల లభ్యతను ప్రతిరోజు ట్రాక్ చేస్తున్నామని, ప్రస్తుతం 3 వేల మెట్రిక్ టన్నులకుపైగా యూరియా అందుబాటులో ఉందని, మరో 2,500 మెట్రిక్ టన్నుల యూరియా రెండు రోజులలో జిల్లాకు చేరుకుంటుందని, ఆగస్టు వరకు అవసరాలకు యూరియా సరిపోతుందని కలెక్టర్ తెలిపారు. ఆగస్టు నెల అవసరాల కోసం ఖమ్మం జిల్లాకు అదనపు యూరియా అలాట్మెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. ప్రతి సేల్ ఆన్ లైన్ ద్వారా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో అంతర్రాష్ట్ర సరిహద్దులు వద్ద పటిష్టమైన బందోబస్తు, ఎరువులు పక్కదారి పట్టకుండా గట్టిగా నిఘా వ్యవస్ధ ఏర్పాటు చేశామని వివరించారు.

కారేపల్లి సొసైటీలో ఎరువుల నిల్వల వివరాలను ఆరా తీస్తున్న కలెక్టర్ అనుదీప్

ఎక్కడైనా ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినట్లు గమనిస్తే, అధిక ధరలకు విక్రయాలు జరిపితే వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. కలెక్టరేట్ లో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎరువుల ఫిర్యాదు టోల్ ఫ్రీ నెం. 1077కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా సింగరేణి తహసీల్డారు రమేశ్, యంపిడివో రాజేందర్, వ్యవసాయ అధికారులు తదితరులు ఉన్నారు.

Popular Articles