Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

సైబర్ నేరాల కేసులో ఖమ్మం జిల్లా బీజేపీ ‘కట్టర్’ లీడర్!

(‘సమీక్ష’ ప్రత్యేక కథనం)
నిండా ముప్పయి దాటని వయస్సు.. ఎక్కువగా సాధారణ వ్యవసాయ కుటుంబాలకు చెందిన యువకులే.. కానీ బేసిక్ మోడల్ ధర రూ. కోటికిపైగా విలువైన ‘డిఫెండర్’ వంటి లగ్జరీ కార్లలో తిరుగుతుంటారు. నెలసరి రూ. 2.00 లక్షల అద్దె చెల్లిస్తూ హైదరాబాద్ నగరంలోని విలాసవంతమైన విల్లాల్లో నివాసముంటున్నారనే ప్రచారం. అలాగని వాళ్లేమీ భారీ వ్యాపారులు కానేకాదు. కానీ కొందరు కేబినెట్ మినిస్టర్లు వినియోగిస్తున్నటువంటి అత్యంత ఖరీదైన, లగ్జరీ కార్లలో తిరుగుతూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న ‘సైబర్’ నేరాల కేసులో ఖమ్మం జిల్లాకు చెందిన నిందితుల కథ ఆద్యంతం ఆసక్తికరం.

ఖమ్మం జిల్లా పెనుబల్లి పోలీసులు గత నెల 24వ తేదీన నమోదు చేసిన ఓ సైబర్ కేసులో పోట్రు ప్రవీణ్ అనే ప్రధాన నిందితుని చరిత్ర ప్రస్తుతం జైలు రిమాండ్ వరకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇదే వరుసలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుని అండదండలతో అరెస్ట్ కాకుండా ఐదో నిందితుడైన ఉడతనేని వికాస్ అనే వ్యక్తి ‘విజయ’వంతంగా తప్పించుకుని తిరుగుతున్న సంగతి కూడా తెలిసిందే.

పెనుబల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో A1 పోట్రు ప్రవీణ్

ఈ నేపథ్యంలోనే ఇదే కేసులో రెండో నిందితునిగా ఉన్నటువంటి పోట్రు కళ్యాణ్ అనే యువకుడి నేరచరిత్రపైనా ఆసక్తికర అంశం తాజాగా వ్యాప్తిలోకి వచ్చింది. ఓ ప్రయివేట్ స్కూల్ నిర్వహణ ద్వారా పోట్రు కళ్యాణ్ తండ్రి వ్యక్తిత్వ వికాస బోధకునిగా సత్తుపల్లి పట్టణంలో పేరుగాంచారు. అయితే పోట్రు కళ్యాణ్ మాత్రం సైబర్ నేరాల ద్వారా కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు పోలీస్ రికార్డుల్లోకి ఎక్కడం గమనార్హం. సైబర్ నేరాలకు పాల్పడడం ద్వారా విదేశీయులను, స్వదేశీయులను మోసగించినట్లు పెనుబల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో పోట్రు ప్రవీణ్ ‘కట్టర్’ బీజేపీ నాయకుడు కావడమే రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. సత్తుపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షునిగా పనిచేసిన పోట్రు కళ్యాణ్ కొంతకాలం క్రితం హైదరాబాద్ కు తన మకాం మార్చాడు.

బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర్ రావు, సత్తుపల్లికి చెందిన ఆర్ఎస్ఎస్-కమ్-బీజేపీ లీడర్ కూసంపూడి రవీంద్రలు నిందితులుగా హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఇటీవల ఓ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ‘సిరిగోల్డ్’ సంస్థ దందాకు సంబంధించి యాసా నాగేశ్వర్ రావు అనే వ్యక్తి ద్వారా అందిన ఫిర్యాదు మేరకు నమ్మకద్రోహం, ఛీటింగ్ తదితర సెక్షన్ల కింద నమోదైన ఈ కేసులో కూసంపూడి రవీంద్రకు హైకోర్టు షరతులతో కూడిన మందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ వివాదాస్పద అంశంలోనే బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకత్వం మల్లగుల్లాలు పడుతుండగా, సత్తుపల్లికి చెందిన ‘కట్టర్’ బీజేపీ లీడర్ పోట్రు కళ్యాణ్ సైబర్ ఛీటింగ్ కేసులో నిందితునిగా మిగలడం ఆ పార్టీకి మరో చికాకు పరిణామంగా పరిశీలకులు భావిస్తున్నారు.

పెనుబల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో రెండో నిందితునిగా పోట్రు కళ్యాణ్ (రెడ్ సర్కిల్ లో..)

అయితే ఈ కేసులో పోట్రు ప్రవీణ్ ను అరెస్ట్ చేసిన ఖమ్మం జిల్లా పోలీసులు మిగతా నిందితులను ఎందుకు పట్టుకోలేకపోతున్నారనే ప్రశ్నలు ఈ సందర్భంగా రేకెత్తుతున్నాయి. కేసులో ఐదో నిందితుడైన ఉడతనేని వికాస్ రాజకీయ అండతో అరెస్ట్ కాకుండా తప్పించుకు తిరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుండగా, బీజేపీ కట్టర్ లీడర్ గా సత్తుపల్లిలో పేరుగాంచిన పోట్రు కళ్యాణ్ అరెస్ట్ అంశంలోనూ పోలీసుల వ్యవహార తీరుపై సహజమైన అభిప్రాయాలే స్థానికుల్లో, ముఖ్యంగా బాధిత కుటుంబాల్లో వ్యక్తమవుతున్నాయి.

నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ, వారి పేరున బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయించి, సైబర్ నేరాలకు పాల్పడడడం ద్వారా కోట్ల రూపాయలను కొల్లగొట్టినట్లు ఈ కేసులోని ప్రధాన సారాంశం. సత్తుపల్లి ప్రాంతంలోని జనంలో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఈ కేసులో నిందితులైన వ్యక్తుల్లోని కొందరు ఒక్కొక్కరు రూ. 100 కోట్ల వరకు సైబర్ నేరాలకు పాల్పడడం ద్వారానే గడించినట్లు తెలుస్తోంది. గడచిన ఆరేళ్ల క్రితంనాటి ఆర్థిక స్థితి, ప్రస్తుత ‘డిఫెండర్’ కార్లలో సంచరిస్తున్న నిందితుల జీవనశైలికి మధ్యగల వ్యత్యాసమే ఇందుకు సాక్ష్యంగా జనంలో చర్చ జరుగుతోంది. ఇంతకీ ఈ భారీ సైబర్ నేరాల కేసులో మిగతా నిందితులను ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేసేది ఎప్పుడనే ప్రశ్నకు సమాధానం లభించేదెన్నడో.. చూడాలి!

Popular Articles