మిర్చి వ్యాపార గుమస్తాను బెదిరించి రూ. 6.00 లక్షల నగదును దోచుకున్న ఘటనలో ఖమ్మంలో పనిచేస్తున్న ఓ ఏసీపీపై, ఇద్దరు కానిస్టేబుళ్లపై గురువారం శాఖాపరమైన వేటు పడింది. ఈమేరకు ఖమ్మం సీటీసీ (సిటీ ట్రెయినింగ్ సెంటర్)లో ఏసీపీగా పనిచేస్తున్ రవిని డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అదేవిధంగా ఏసీపీకి గన్ మెన్ గా, డ్రైవర్ గా పనిచేస్తున్న కానిస్టేబుళ్లు నాగరాజు, ఉపేందర్ లను సస్పెండ్ చేస్తూ ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఉత్తర్వు జారీ చేశారు.

కొద్దిరోజుల క్రితం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో మిర్చి వ్యాపార గుమస్తాను బెదిరించి రూ. 6 లక్షల నగదును కానిస్టేబుళ్లు నాగరాజు, ఉపేందర్ లు దోపిడీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ తర్వాత పరిణామాల్లో ఈ ఘటనలో ఎటువంటి ఫిర్యాదు లేకపోవడంతో కేసు నమోదు కాలేదు. కానీ జరిగిన ఘటనపై సీపీ సునీల్ దత్ శాఖాపరమైన విచారణ జరిపించి, దోపిడీ ఘటనలో ఏసీపీ రవి వ్యవహార తీరుపై చర్యలకు సిఫారసు చేయగా, అతన్ని డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్తర్వు వెలువడింది. దోపిడీలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఆ ఇద్దరు కానిస్టేబుళ్లపై సీపీ సునీల్ దత్ సస్పెన్షన్ వేటు వేశారు. కాగా ఇదే ఘటనలో ఓ విలేకరి పాత్ర ప్రధానంగా ఉన్నట్లు కూడా పోలీసుల విచారణలో వెలుగు చూడడం గమనార్హం.
