ఖమ్మం: వెలుగుమట్ల భూముల్లో వసూళ్లకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కుంటున్న ముఠాపై ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కీలక ప్రకటన చేశారు. ఈమేరకు ఆయన గతరాత్రి పొద్దుపోయాక ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులకు అండగా ఉంటామని, బాధితుల నుంచి దోచుకున్న డబ్బును నిందితుల నుండి రికవరీ చేసి, ఆ సొమ్మును తిరిగి భాదితులకు అప్పగిస్తామని సునీల్ దత్ హామీ ఇచ్చారు.
ప్రభుత్వ భూముల్లో దురాక్రమణకు పాల్పడి కొంతమంది అక్రమంగా డబ్బులు వసూలు చేసి పేద ప్రజలకు భూములను కేటాయించారని చెప్పారు. ఈమేరకు పలువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం 13 మందిపై నమోదు కేసుల నమోదు చేశామన్నారు. ఈ కేసుల్లో నిందితులైన తల్లూరి కృష్ణ, మంకిడి లింగరాజు, ముడిగ రాములు, కల్తీ ఎర్రబాబు అనే నలుగురు వ్యక్తులను ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.
నిందితులు ఓ గ్యాంగ్‌గా ఏర్పడి, తాము OPDR భూదాన్ కమిటీ సభ్యులమని తప్పుడు ప్రచారం చేసి, అమాయక ప్రజలను ప్రేరేపించి భూదాన్ భూముల్లో గృహ స్థలాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఒక్కొక్కరి డబ్బులు వసూలు చేశారన్నారు. ఆ తర్వాత భూదాన్, ప్రభుత్వ, ప్రైవేట్ పట్టా భూములను అక్రమంగా ఆక్రమించి షెడ్లు నిర్మించారన్నారు. ఆ భూములను మరికొంతమంది అమాయకులకు అమ్మకానికి చూపించి మోసం చేశారని చెప్పారు.
ఈ ముఠా చర్యల వల్ల అనేక మంది బాధితులు మోసపోయారని తెలిపారు. గృహ స్థలాలు ఇస్తామని చెప్పి అమాయక ప్రజల నుండి లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసినట్లు తేలిందన్నారు. ఈ ముఠా సభ్యులపై గతంలో సుమారు 15 కేసులు వరకు నమోదు అయినట్టు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, ఎవరైనా బాధితులు మోస పోయినట్లయితే ఫిర్యాదు చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ విజ్ఞప్తి చేశారు.

