Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

‘నిర్లక్ష్యం’ కేసులో ఖమ్మం కోర్టు సంచలన తీర్పు

ఖమ్మం: వివాహ శుభకార్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ బాలుని మృతికి కారణమైన ఇద్దరు వ్యక్తులకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి కె. ఉమాదేవి బుధవారం సంచలన తీర్పు చెప్పారు.

ప్రాసిక్యూషన్ కథన ప్రకారం.. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం శాంతినగర్ కాలనీలో కంచపోగు పెద్ద సత్యం ఇంట్లో 2002 ఆగస్టు 21న పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా ఫ్లడ్ లైట్ల ఏర్పాటు కోసం విద్యుత్ స్తంభం నుంచి లాగిన సర్వీస్ వైరును నిర్లక్ష్యంగా కిందకు వదిలేశారు. అయితే ఈ వైరును తాకిన కొత్తపల్లి రాణా హుస్సేన్ అనే ఎనిమిదేళ్ల బాలుడు విద్యుత్ షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనపై బాలుని తల్లి కొత్తపల్లి సుజాత కల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యుత్ సర్వీస్ వైరును నిర్లక్ష్యంగా కిందకు వదిలేసి తన కుమారుడు రాణా హుస్సేన్ మృతికి కారకులైన కంచపోగు పెద్ద సత్యం, కంచపోగు నరేష్ లతోపాటు ఎలక్ట్రిషియన్ కంచపోగు లక్ష్మయ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని సుజాత పోలీసులను కోరారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఆ తర్వాత కోర్టులో ఛార్జిషీట్ ను దాఖలు చేశారు.

ఈ కేసులో వాద, ప్రతివాదనలు విన్న తర్వాత ప్రధాన నిందితుడైన కంచపోగు పెద్ద సత్యం, మూడో నిందితుడైన కంచపోగు లక్ష్మయ్యలను దోషులుగా నిర్ధారిస్తూ, వారిద్దరికీ ఏడేళ్ల జైలు శిక్షను విధిస్తూ జడ్జి కె. ఉమాదేవి తీర్పును వెలువరించారు. ఇదే కేసులో రెండో నిందితుడైన కంచపోగు నరేష్ చనిపోయాడు. కేసులో నిందితులకు శిక్ష పడే విధంగా సమర్ధవంతమైన విధులు నిర్వహించిన అప్పటి పోలీసు అధికారి హనోక్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జమ్ముల శరత్ కుమార్ రెడ్డి, ఎస్ఐ కె. శ్రీకాంత్, కోర్టు కానిస్టేబుల్ పి. జ్యోతిబసు, హోంగార్డ్ మహ్మద్ ఆయూబ్ లను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

Popular Articles