పోక్సో కేసులో ఖమ్మం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇద్దరు దోషులకు జీవిత ఖైదును విధించడంతోపాటు ఒక్కొక్కరికి రూ. 2.10 లక్షల జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా జడ్జి కె. ఉమాదేవి గురువారం తీర్పు వెల్లడించారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 2021 ఫిబ్రవరి 7వ తేదీన ఇంటి బయట అడుకుంటున్న బాలిక వద్దకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు మాయమాటలతో బలవంతంగా మోటార్ సైకిల్ పై తీసుకెళ్లి నగర శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఖమ్మం ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ లో Cr. No. 70/2021 ద్వారా SC.POCSO .198/2021.U/S 376AB, 366, 294(b), 323, 506,109 IPC & Sec.4 & 17 of POSCO యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ, సాక్ష్యాధారాల సేకరణ వేగవంతంగా పూర్తి చేసిన పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
విచారణలో వాద, ప్రతివాదనలు విన్నఅనంతరం ఈ కేసులో ఇద్దరు నిందితులను దోషులుగా కోర్టు నిర్ధారించింది. మొదటి నిందితుడైన ఖమ్మం నగరంలోని రమణగుట్టకు చెందిన ఆటో డ్రైవర్ కాలేపల్లి సంపత్ కు, అతనికి సహకారించిన రెండో నిందితుడైన ఖమ్మంలోని మంచికంటి నగర్ కు చెందిన పసువుల నవీన్ కు జీవితకాల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రెండు లక్షల పది వేల రూపాయలు జరిమానాలు విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా జడ్జి కె. ఉమాదేవి తీర్పునిచ్చినట్లు ఖానాపురం హవేలీ సీఐ భాను ప్రకాష్ వివరించారు.
కీలకమైన ఈ కేసులోని నిందితులు నేరం నుండి తప్పించుకోకుండా ప్రాసిక్యూషన్ తరపున వాదించి దోషులకు శిక్ష పడేలా చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఏ. శంకర్, ఇన్స్‌పెక్టర్ వెంకన్న బాబు, (ప్రస్తుతం డిఎస్పీ ఇంటిలిజెన్స్) ఇన్స్‌పెక్టర్ భానుప్రకాశ్, కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లు శ్రీనివాస్ రావు, నాగేశ్వరరావు ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు. భవిష్యత్తులో కేసుల నుండి నిందితులు తప్పించుకోకుండా ఇదే స్పూర్తితో ముందుకు వెళ్లాలని సీపీ సూచించారు.