(సమీక్ష ప్రత్యేక కథనం)
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. అయితే కొత్తగూడెం నగరపాలక సంస్థలో మాత్రం ఆశించిన విజయాన్ని చేజిక్కించుకోలేకపోయింది. ఇక్కడ సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు హోరా హోరీగా తలపడగా, కొత్తగూడెం నగర ఓటర్లు రెండు పార్టీలపట్ల ఎటువంటి వివక్ష చూపకుండా సరిసంఖ్యలో ఆయా పార్టీల అభ్యర్థులను గెలిపించడం విశేషం.
ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో గల 117 వార్డుల్లో 83 వార్డుల్లో గెలుపొందడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని దక్కించుకుంది. తద్వారా ఐదు మున్సిపాలిటీల్లోనూ స్పష్టమైన ఆధిక్యతతో చైర్ పర్సన్, వైస్ చైర్మెన్ పదవులను దక్కించుకోనుంది. కేవలం 21 వార్డులను దక్కించుకుని బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలవగా, సీపీఎం మూడు వార్డుల్లో, సీపీఐ నాలుగు, స్వతంత్రులు ఆరు వార్డుల్లో జిల్లా వ్యాప్తంగా గెలుపొందారు.
- మున్సిపాలిటీల వారీగా ఏదులాపురంలో మొత్తం 32 వార్డులు ఉండగా, కాంగ్రెస్ 24, బీఆర్ఎస్ 2, సీపీఎం 2, సీపీఐ 3, ఇండిపెండెంట్లు ఒక స్థానంలో గెలుపొందారు. ఇక్కడ పాలకవర్గాన్ని చేపట్టడానికి మేజిక్ ఫిగర్ 16 కాగా, కాంగ్రెస్ 24 వార్డుల్లో గెలుపొందింది.
- వైరా మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా, కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 5, సీపీఎం 1, సీపీఐ 1, ఇండిపెండెంట్లు ఒక స్థానంలో గెలుపొందారు. ఇక్కడ పాలకవర్గాన్ని చేపట్టడానికి మేజిక్ ఫిగర్ 10 కాగా, కాంగ్రెస్ 12 వార్డుల్లో గెలుపొందింది.
- సత్తుపల్లిలో మొత్తం 23 వార్డులు ఉండగా, కాంగ్రెస్ 17, బీఆర్ఎస్ అభ్యర్థులు 6 స్థానాల్లో గెలుపొందారు. ఇక్కడ పాలకవర్గాన్ని చేపట్టడానికి మేజిక్ ఫిగర్ 12 కాగా, కాంగ్రెస్ 17 వార్డుల్లో గెలుపొందింది.
- కల్లూరు మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా, కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 7, ఒక ఇండిపెండెంట్ గెలుపొందారు. ఇక్కడ పాలకవర్గాన్ని చేపట్టడానికి మేజిక్ ఫిగర్ 11 కాగా, కాంగ్రెస్ 12 వార్డుల్లో గెలుపొందింది.
- మధిరలో మొత్తం 22 వార్డులు ఉండగా, కాంగ్రెస్ 18, బీఆర్ఎస్ 1, టీడీపీ అభ్యర్థులు మూడు స్థానాల్లో గెలుపొందారు. కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు కుదుర్చుకుని ఇక్కడ విజయం సాధించడం గమనార్హం. మధిరలో పాలకవర్గాన్ని చేపట్టడానికి మేజిక్ ఫిగర్ 13 కాగా, కాంగ్రెస్ స్వతహాగా 18 వార్డుల్లో, మిత్రపక్షమైన టీడీపీ మూడు స్థానాల్లో గెలుపొందింది.
- ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో మొత్తం 24 వార్డులు ఉండగా, కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 3, ఇండిపెండెంట్లు రెండు స్థానాల్లో గెలుపొందారు. ఇక్కడ పాలకవర్గాన్ని చేపట్టడానికి మేజిక్ ఫిగర్ 13 కాగా, కాంగ్రెస్ 19 వార్డుల్లో గెలుపొందింది.
- అదేవిధంగా అశ్వారావుపేట మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉండగా, కాంగ్రెస్ 17, బీఆర్ఎస్ 2, బీజేపీ 1, ఇండిపెండెంట్లు రెండు స్థానాల్లో గెలుపొందారు. ఇక్కడ పాలకవర్గాన్ని చేపట్టడానికి మేజిక్ ఫిగర్ 13 కాగా, కాంగ్రెస్ 17 వార్డుల్లో గెలుపొందింది.
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో విజయబావుటా ఎగురవేసిన కాంగ్రెస్ కొత్తగూడెం నగరపాలక సంస్థలో మాత్రం గెలుపునకు చేరువ కాలేకపోయింది. ఇక్కడ కాంగ్రెస్ కు ధీటుగా సీపీఐ నిలవడంతో ఇరు పార్టీలకు సమాన సంఖ్యలో 22 చొప్పున డివిజన్లు దక్కాయి. బీఆర్ఎస్ 8, ఇండిపెండెంట్లు ఆరుగురు, సీపీఎం, బీజేపీ పార్టీల తరపున ఒక్కొక్కు చొప్పున కార్పొరేటర్లుగా గెలుపొందారు. ఇక్కడ మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

