ఐఏఎస్ అధికారి ముజమ్మిల్ ఖాన్ పరమశివునికి ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న ఖాన్ గురువారం తీర్థాల సంగమేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివయ్య దర్శనానంతరం భక్తులతో మాట్లాడారు. జాతర సందర్భంగా చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
జిల్లాలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని తాను స్వామి వారిని ప్రార్థించినట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఈ సందర్భంగా చెప్పారు. అనంతరం ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు, అర్చకులు జిల్లా కలెక్టర్ ను శాలువాతో సత్కరించి, ప్రసాదం అందజేశారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వెంట ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ రాంప్రసాద్, దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.