Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

కలెక్టర్ నోట ‘తుమ్మల’ మాట

ఆయిల్ పామ్ సాగు అంశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అత్యంత పట్టుదలతో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో కార్యక్రమం ఏదైనప్పటికీ తుమ్మల తన ప్రసంగంలో ‘ఆయిల్ పామ్’ ప్రస్తావన ఖచ్చితంగా తీసుకువస్తున్నారు. నగరపాలక సంస్థ కార్యక్రమాల్లోనూ పామాయిల్ సాగు చేయండి, మీ కుటుంబాల భవిష్యత్తు బాగుంటుంది.. అంటూ రైతులను కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటల సాగు లక్ష్యంగా మంత్రి తుమ్మల ఇప్పటికే ప్రకటించారు.

ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కూడా పామాయిల్ సాగు చేయాలని రైతులకు పిలుపునివ్వడం విశేషం. లాభదాయక ఆయిల్ పామ్ పంటను అధిక సంఖ్యలో రైతులు సాగు చేయాలని, ఆ దిశగా జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ చెప్పారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఖాన్ రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామంలో ఆలస్యం రామారావు పండిస్తున్న ఆయిల్ పామ్ పంటలను పరిశీలించారు. ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తున్న రైతులతో కలెక్టర్ ముచ్చటించారు. గతంలో ఏ పంటలు సాగు చేశారు? ఎంత విస్తీర్ణంలో పంట వేశారు? అంతర పంటల సాగు ఎలా ఉంది? ఆయిల్ పామ్ పంటపై ఏటా ఎంత దిగుబడి వస్తుంది? నీటి వనరులు ఎలా ఉన్నాయి? అంటూ వివిధ అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఆయిల్ పామ్ తోటలో నడుస్తూ పరిశీలిస్తున్నకలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, ఆయిల్ పామ్ పంట వేసేందుకు ప్రభుత్వం మొక్కలకు, డ్రిప్ ఇరిగేషన్ సదుపాయ కల్పనకు, మొదటి నాలుగు సంవత్సరాల వరకు అంతర్ పంట పెట్టుబడులకు కొంత సబ్సిడీని అందిస్తుందని అన్నారు. ఆయిల్ పామ్ పంట ద్వారా రైతులు బాగు పడతారని, 4 సంవత్సరాల నుంచి ఆయిల్ పామ్ పంట వల్ల ఆదాయం రావడం ప్రారంభమవుతుందని, 7వ సంవత్సరం నుంచి పూర్తిస్థాయి పంట వస్తుందని, రైతులకు అద్భుతంగా ఆదాయం లభిస్తుందని, పరిసరాలలోని ఇతర రైతులు కూడా ఆయిల్ పామ్ పంట సాగు చేసేలా ప్రోత్సహించాలని కలెక్టర్ తెలిపారు.

ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్

పామ్ ఆయిల్ పంట కోత యంత్రాలు సబ్సిడీపై అందించేందుకు చర్యలు చేపడతామని అన్నారు. గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ ద్వారా ఆయిల్ పామ్ పంట వెయ్యి ఎకరాలలో క్లస్టర్ ఉంటే రైతులకు లాభం అయ్యే విధంగా లేబర్ సరఫరా చర్యలు చేపడతామని అన్నారు. గ్రామంలో అర ఎకరం వరకు లీజ్ కు ఇస్తామని నెల రోజుల వ్యవధిలో క్లస్టర్ హైరింగ్ సెంటర్ ఏర్పాటు చేసి అత్యాధునిక వ్యవసాయ పరికరాలు రైతులకు అందుబాటులోకి తీసుకొని రావాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. రైతులకు సరఫరా చేసే ప్రతి ఆయిల్ పామ్ మొక్కకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. గ్రామంలో ఉన్న రెవెన్యూ సమస్యలు వివరాలు తెలుసుకున్న కలెక్టర్ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సాదా బైనామా దరఖాస్తులకు ప్రభుత్వం నుంచి వచ్చే పరిష్కారం మేరకు జిల్లాలో చర్యలు చేపడతామని అన్నారు.

ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట ఉద్యానవన శాఖ అధికారి జి నగేష్, రఘునాథపాలెం మండల తహసీల్దార్ విల్సన్, గోద్రెజ్ ఆగ్రో వెట్ లిమిటెడ్ మేనేజర్ ఏ. రామకృష్ణ, టి.ఎస్.ఎం.ఐ.పీ నాగమణి, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.

Popular Articles