ఖమ్మం: ఖమ్మం వన్ టౌన్ సీఐ కరుణాకర్ చేయి ఫ్రాక్చర్ కు దారి తీసిన ఘటనలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయినవారిలో బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజుతోపాటు కోయిలపొంగు వెంకట్, కోయిలపొంగు ఉపేందర్ ఉన్నారు. ఈ ముగ్గురినీ ఖమ్మం టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆగ్రహించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సీఐ చేయి విరిగిన కేసులో అత్యంత వేగంగా అరెస్టులు జరిగినట్లు తెలుస్తోంది.
ఘటన పూర్వాపరాల్లోకి వెడితే… ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను విచారించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఖమ్మంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో ఖమ్మం వన్ టౌన్ సీఐ కరుణాకర్ చేయి విరిగింది.

ఈ ఘటనపై పోలీసులు మొత్తం ఆరుగురిపిై క్రైం నెం. 66/2026 ద్వారా కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతోపాటు సీఐ చేయి విరగడానికి కారకులయ్యారనే అభియోగాలపై బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కోయిల పొంగు వెంకట్, కోయిలపొంగు ఉపేందర్, నామవరపు ఈశ్వర్, మాటేటి కిరణ్, భూక్యా అశోక్ లపై కేసు నమోదు చేశారు. ఆరుగురు నిందితుల్లో పగడాల నాగరాజును, వెంకట్ ను, ఉపేందర్ ను అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

