Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

జైలుకు ఖమ్మం బీఆర్ఎస్ లీడర్

ఖమ్మం: బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు సహా ముగ్గురిని పోలీసులు గత రాత్రి జిల్లా జైలుకు తరలించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను సిట్ అధికారులు విచారించడాన్ని నిరసిస్తూ ఖమ్మంలో బీఆర్ఎస్ నాయకులు నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలో వన్ టౌన్ సీఐ కరుణాకర్ చేయి విరిగిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనకు బాధ్యులుగా బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజుపైనేగాక మరో ఐదుగురు పార్టీ కార్యర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైం నెం. 66/2026 ద్వారా బీఎన్ఎస్ చట్టంలోని 287 189(3),191(3).126(2),121(1) r/w190 సెక్షన్ల కింద, క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ 21/76 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

అనంతరం పగడాల నాగరాజును, పోయిలపొంగు వెంకట్, ఉపేందర్ లను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ చేసిన పగడాల నాగరాజు సహా ముగ్గురిని గత రాత్రి పోలీసులు కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి శ్రీమతి బెక్కం రజని నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నాగరాజును, వెంకట్ ను, ఉపేందర్ ను గత రాత్రి ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు.

ప్రాథమిక చికిత్స తర్వాత సీఐ కరుణాకర్

అసలేం జరిగింది?
సీఐ చేయి విరగడానికి దారి తీసిన పరిణామాలను వివరిస్తూ ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తి ఓ ప్రకటన విడుదల చేశారు. బందోబస్తు విధుల్లో ఉన్న ఖమ్మం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ విధులకు ఆటంకం కలిగించి, గాయపరిచిన పలువురుపై ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు ఆయన ప్రకటించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను సిట్ అధికారులు విచారించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్లు ఆయన చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థన మేరకు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ర్యాలీలో 100 మందికి మించకూడదని చెప్పామన్నారు. దిష్టి బొమ్మలు దగ్దం చేయడం, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడం, రోడ్డుపై ధర్నాలు చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించరాదనే షరతులతో తమ ఆఫీసు నుంచే అనుమతి ఇచ్చామని ఏసీపీ రమణమూర్తి పేర్కొన్నారు.

ఖమ్మం సిటీ ఏసీపీ రమణమూర్తి

కానీ తాము విధించిన షరతులకు, నిబంధనలకు విరుద్ధంగా ఉదయం 11.20 గంటల సమయంలో పరిమితికి మించి 200లకు పైగా బైకులతో ర్యాలీ నిర్వహించారని చెప్పారు. అంతేగాక దాదాపు 300 మందితో ఇల్లందు క్రాస్ రోడ్డుపై అడ్డంగా బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసే చర్యను నిలువరించేందుకు ప్రయత్నించిన పోలీసులపై పెట్రోల్ చల్లుతూ, భయభ్రాంతులకు గురిచేస్తూ, ఉద్దేశపూర్వకంగా ఇన్స్పెక్టర్ కరుణాకర్ విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు. గాయపరిచడంతో సీఐ చేయి విరిగిందని, తాము సీఐని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స అందించామన్నారు.

ఈ నేపథ్యంలో బందోబస్త్ విధులు నిర్వహిస్తున్న ఖమ్మం టూ టౌన్ ఎస్సై ఉఫాతుల్ రఫీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఈమేరకు పగడాల నాగరాజును, అతని అనుచరులు పొయిల పొంగు ఉపేందర్, పొయిలపొంగు వెంకట్ ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు, నామవరపు ఈశ్వర్, మాటేడి కిరణ్, భుక్య అశోక్ మరి కొంతమందిపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఏసీపీ రమణమూర్తి వివరించారు.

Popular Articles