Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

పోలీస్ శాఖలో సంచలనం: గంటలోనే ఖమ్మం ఏసీపీ పోస్టింగ్ మార్పు!

తెలంగాణా పోలీస్ శాఖలో ఇదో సంచలన ఘటన. ఓ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి పోస్టింగ్ సుమారు గంట వ్యవధిలోనే మారిన ఉదంతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయిదు నెలలకు పైగా ఖాళీగా ఉన్న ఖమ్మం అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (ఏసీపీ) పోస్టింగ్ అంశంలో చోటు చేసుకున్న పరిణామమిది. కొద్ది సేపటి క్రితమే బి. రామానుజం అనే అధికారిని ఖమ్మం ఏసీపీగా నియమిస్తున్నట్లు డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఫ్యాక్స్ ద్వారా వచ్చినట్లు పేర్కొన్న పోస్టింగ్ ఉత్తర్వుపై ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయ ‘ముద్ర’ కూడా పడింది.

అయితే ఈ ఉత్తర్వు ఎంతో సేపు అమలులో నిలవకపోవడమే అసలు విశేషం. సుమారు గంట వ్యవధిలోనే రామానుజానికి ఇచ్చిన పోస్టింగ్ ఉత్తర్వు స్థానంలో బి. ఆంజనేయులు అనే అధికారిని ఖమ్మం ఏసీపీగా నియమిస్తున్నట్లు డీజీపీ కార్యాలయం తాజా ఉత్తర్వు ద్వారా వెల్లడించింది. తొలుత జారీ చేసిన ఉత్తర్వులో ఏసీపీగా పోస్టింగ్ ఇచ్చిన అధికారి పేరులో పొరపాటు దొర్లినట్లు కూడా స్పష్టంగా పేర్కొనడం గమనార్హం కాగా, ఈ ఇద్దరు అధికారులు ప్రస్తుతం సీఐడీ విభాగంలోనే విధులు నిర్వహిస్తుండడం కొసమెరుపు. ఆయా ఇద్దరు పోలీసు అధికారుల ఉత్తర్వులను దిగువన చూడవచ్చు.

Popular Articles