ఇద్దరు రౌడీషీటర్లపై ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తి కీలక ప్రకటన చేశారు. పేరల్లి ప్రవీణ్, పగడాల విజయ్ అలియాస్ చంటిలపై పీడీ యాక్టును కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు బుధవారం ప్రకటించారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో పాల్గొంటూ, ప్రజలను భయభ్రంతులకు గురి చేస్తున్నందుకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నందుకు వీరిపై పీడీ యాక్టు అమలును ఏడాదిపాటు పొడిగించినట్లు చెప్పారు. ఈ ఇద్దరు రౌడీషీటర్లు భూకబ్జాలకు పాల్పడుతూ, బెదిరింపులకు దిగుతూ, అక్రమ వసూళ్ల వంటి నేరాలతో ప్రజలను భయభ్రాంతులకు గరిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వీరి ఆగడాలకు శాశ్వతంగా చెక్ పెట్టడానికి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు గతంలోనే పీడీ యాక్టును అమలు చేసినట్లు ఏసీపీ రమణమూర్తి చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరు కూడా చంచల్ గూడ జైలులో ఉన్నట్లు పేర్కొన్నారు.
ముగ్గురు దొంగల అరెస్ట్:
కాగా కరెంటు మోటార్ల, వాహనాల టైర్ల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు దొంగలను కూసుమంచి పోలీసులు అరెస్ట్ చేశారు. మండలంలోని పోచారానికి చెందిన పుట్ట నరేష్, యాట రాజు, నిమ్మల రమేష్ అనే వ్యక్తులు కరెంటు మోటార్లను, వాహనాల టైర్లను దొంగిలిస్తున్నట్లు చెప్పారు. వాహనాల తనిఖీ సందర్భంగా ఈశ్వరమాదారం వద్ద ఈ ముగ్గురు దొంగలను పట్టుకుని, వారి వద్ద నుంచి ఏడు కరెంటు మోటార్లను, మూడు టైర్లను, 14 కిలోల కాపర్ వైరును, మూడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు కూసుమంచి పోలీసులు వెల్లడించారు.

పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు, జరిమానా:
పోక్సో కేసులో దోషిగా రుజువైన వ్యక్తికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 50 వేల జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జడ్జి జస్టిస్ కె. ఉమాదేవి బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ఇంటిబయట ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను 2024 ఫిబ్రవరి 2వ తేదీన వైరా మండలం గొల్లనపాడుకు చెందిన చెరుకూరి లాలయ్య (70) మాయమాటలతో ఇంటికి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడు లాలయ్యపై వైరా పోలీసులు పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేశారు. కేసు విచారణలో వాదోపవాదాలను విన్న తర్వాత లాలయ్యను దోషిగా నిర్ధారిస్తూ జస్టిస్ ఉమాదేవి అతనికి 20 ఏళ్ల కఠిన జైలు శిక్షను, రూ. 50 వేల జరిమానాను విధించారు. ప్రాసిక్యూషన్ తరపున అదనపు ప్రాసిక్యూటర్ మహ్మద్ ఇర్సాద్ వాదించగా,విచారణ అధికారులు వైరా సీఐ సాగర్, సబ్ ఇన్స్పెక్టర్ రామారావు, భరోసా లీగల్ ఆఫీసర్ ఎం.ఉమారాణి, కోర్టు కానిస్టేబుల్ చిరంజీవి, మోహన చారి, కోర్టు లైజనింగ్ ఆఫీసర్, శ్రీకాంత్ లను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.


