Top 5 This Week

Related Posts

వెలుగుమట్ల ‘వసూళ్ల’ రికవరీ దర్యాప్తులో కీలక పురోగతి

ఖమ్మం: రాష్ట్ర వ్యాప్తంగానేకాదు, జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశంగా మారిన వెలుగుమట్ల భూముల కేసుల దర్యాప్తులో ఖమ్మం జిల్లా పోలీసులు కీలక పురోగతి సాధించారు. వెలుగుమట్ల భూముల్లో ఇండ్లు నిర్మించుకున్నవారి నుంచి డబ్బు వసూళ్లు చేశారనే అభియోగంపై ఇప్పటికే నమోదైన కేసుల్లో అరెస్టయిన నిందితుల ఆస్తులను పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని అదనపు డీసీపీ ప్రసాదరావు శనివారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు.

వెలుగుమట్ల భూ ఆక్రమదారులు/నిందితులు వసూళ్లు చేసిన డబ్బును రాబట్టే చర్యల్లో భాగంగా ప్రత్యేక పోలీస్ బృందాలు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. బాధితుల నుంచి వసూళ్లు చేసిన డబ్బుతో నలుగురు నిందితులు కొనుగోలు చేసిన అక్రమ ఆస్తులను గుర్తించినట్లు చెప్పారు. ఆయా ఆస్తుల అటాచ్మెంట్ కోసం చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు అదనపు డీసీపీ తెలిపారు. కొంతమంది నిందితుల బ్యాంక్ ఖాతాల్లో జరిగిన నగదు లావాదేవీలను కూడా గుర్తించామని, ఆయా అకౌంట్ల ఫ్రీజ్ కోసం బ్యాంక్ అధికారులకు లిఖిత పూర్వకంగా సిఫారసు చేసినట్లు తెలిపారు.

అదేవిదంగా ఇప్పటికే అరెస్టయిన నిందితులను పోలీస్ కస్టడీ కోసం కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. నిందితుల నుండి మరింత సమాచారం సేకరించే దిశగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కేసుల్లోని నిందితులంతా ఓ ముఠాగా ఏర్పడి ఒక్కొక్క ప్లాటును ముగ్గురు, నలుగురికి విక్రయించి డబ్బు తీసుకున్నట్టు పోలీస్ దర్యాప్తులో తేలిందన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టపరమైన చర్యలు చేపట్టామని అదనపు డీసీసీ ప్రసాదరావు చెప్పారు.

Popular Articles