Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

‘వెలుగుమట్ల’ బాధితుల గుర్తింపు సర్వేలో కీలకాంశాలు

ఖమ్మం: నగర శివారల్లోని వెలుగుమట్ల భూదాన్ భూముల ఆక్రమణల తొలగింపు చర్యలో ఇండ్లు కోల్పోయిన కుటుంబాల సర్వేలో కీలకాంశాలు వెలుగు చూశాయి. జిల్లాలోని 21 మంది తహశీల్దార్లు ఇండ్లు కోల్పోయిన వ్యక్తుల సామాజిక, ఆర్థిక సర్వేను నిర్వహిస్తున్నారు. శనివారం వరకు నిర్వహించిన సర్వేలో ఆయా వ్యక్తులు ఎక్కడివారనే అంశాన్ని అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఓ ప్రకటన విడుదల చేశారు.

ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. శనివారం వరకు నిర్వహించిన సర్వేలో మొత్తం 632 మందిని గుర్తించగా, వీరిలో ఖమ్మం జిల్లాకు చెందినవారు 522, ఇతర జిల్లాలకు చెందినవారు 107, ఇతర రాష్ట్రాలకు చెందినవారు 3 ముగ్గురు చొప్పన ఉన్నట్లు గుర్తించారు. ఇందులోనూ ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన 182 మంది, ఖమ్మం జిల్లాలోని ఇతర మండలాలకు చెందిన వారు 340 మంది ఉన్నారని చెప్పారు. అలాగే రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చెందినవారు 107 మంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ముగ్గురు ఉన్నట్లు కలెక్టర్ వివరించారు.

ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలో ఈనెల 24న భూదాన్ భూములలో చేపట్టిన ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో ఇండ్లు కోల్పోయిన వ్యక్తుల సామాజిక, ఆర్థిక సర్వే ముమ్మరంగా జరుగుతుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఈ సందర్భంగా చెప్పారు. సర్వే ప్రక్రియ కొనసాగుతుందని, యుద్ధ ప్రాతిపదికన దీని పూర్తికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సర్వే పూర్తయిన తర్వాత అర్హులకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం నివాస స్థల పట్టాలు, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుకు చర్యలు చేపడతామని కలెక్టర్ ప్రకటించారు. సర్వేకు సంబంధించిన వ్యక్తులు, వారి వారి గ్రామాల్లో అందుబాటులో ఉండి, సామాజిక, ఆర్థిక సర్వేకు సహకరించాలని జిల్లా కలెక్టర్ తన ప్రకటనలో కోరారు.

Popular Articles