బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, తెలంగాణా ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు ఈనెల 5వ తేదీన సిట్ విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు గడచిన పధ్నాలుగు నెలలుగా అమెరికాలో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇండియాకు తిరిగి రావాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశంతో ప్రభాకర్ రావు తిరిగి రానున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు తాను హాజరవుతానని ప్రభాకర్ రావు దర్యాప్తు సంస్తకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు సిట్ విచారణకు సహరిస్తానని కూడా ప్రభాకర్ రావు సుప్రీంకోర్టుకు అండర్ టేకింగ్ లెటర్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో వన్ టైం ఎంట్రీ పాస్ పోర్టు అందిన వెంటనే ప్రభాకర్ రావు ఇండియాకు రానున్నారు. రిటైర్డ్ అధికారి ప్రభాకర్ రావును విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చే అవకాశాలున్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
