ప్రభుత్వ అధికారులు.. ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు.. తప్పు కూడా కాదు. రాజకీయ రంగంలోకి ప్రవేశించి సత్తా చాటిన అధికారులు అనేక మంది ఉన్నారు.. చతికిల పడిన వారూ లేకపోలేదు. రాజకీయాలు వేరు.. పాలనా వ్యవహారాలు వేరు.. అధికార బాధ్యతలు వేరు. ఆయా అంశాల్లో అనేక నిర్వచనాలు. అదంతా వేరే సబ్జెక్ట్. కానీ ప్రభుత్వ సర్వీసులో గల కొందరు ఉన్నతాధికారులు, ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు వ్యవహరించే తీరు అప్పుడప్పుడు వివాదాస్పదమవుతుంటుంది. విధుల్లో సమర్ధవంత అధికారిగా భావించి, అభిమానించి.. ఓ రాజకీయ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కీలక స్థానంలో బాధ్యతలను అప్పగించినట్లు ప్రాచుర్యంలో గల ఐఏఎస్ అధికారి, మరో ప్రభుత్వంలో విధులు నిర్వహిస్తూ వివాదాస్పదంగా మారిన నేపథ్యం తెలంగాణాలో హాట్ టాపిక్ గా మారడమే అసలు విశేషం.
స్మితా సబర్వాల్ పేరు తెలుసు కదా..? పెద్దగా పరిచయం అక్కర్లేని ఐఏఎస్ అధికారి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అధికారికంగా కీలక బాధ్యతలు నిర్వహించిన ఉన్నతాధికారి. ఆమె పనితీరుకు, విధుల్లో సమర్ధతకు ముగ్ధుడైన కేసీఆర్ తన ప్రభుత్వంలో ఆమెను కీలక స్థానంలో నియమించి, ముఖ్య బాధ్యతలను అప్పగించినట్లు ప్రచారం ఉంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పర్యాటక శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న స్మితా సబర్వాల్ తన ఎక్స్ ఖాతాలో నిన్న చేసిన పోస్టుపైనే ఇప్పుడు భిన్న రకాల చర్చ జరుగుతోంది. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో గత నెల 31వ తేదీన తన ఎక్స్ ఖాతాలో చేసిన రీట్వీట్, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఈ భిన్న చర్చకు కారణమయ్యాయి.

ఏఐతో రూపొందించిన కల్పిత ఫొటో పోస్టును స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారనే అభియోగంపై పోలీసులు ఆమెకు ఈనెల 12వ తేదీన నోటీసులు జారీ చేశారు. తనకు పోలీసులు నోటీసుల అనంతరం ఆమె నిన్న అదే ఎక్స్ ఖాతా ద్వారా రియాక్ట్ కావడమే కాదు, పోలీసులపై కొన్ని ప్రశ్నలు సంధించారు. పోలీసులను ప్రశ్నించడమంటే పరోక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లుగానే భావించవచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పోలీసులు ప్రభుత్వ యంత్రాంగంలో భాగం కాబట్టి. ఇదే ప్రభుత్వ యంత్రాంగంలో భాగమైన ఐఏఎస్ అధికారి తనకిచ్చిన నోటీసులకు స్పందనగా ప్రశ్నలు సంధించడమే ఇక్కడ అసలు విశేషం.

స్మితా సబర్వాల్ నిన్న తన ఎక్స్ ఖాతాలో ఏమన్నారు..? చట్టానికి కట్టుబడే పౌరురాలిగా తాను గచ్చిబౌలి పోలీసులకు పూర్తిగా సహకరించినట్లు చెప్పారు. వారి నోటీసులకు తన స్టేట్ మెంటును ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆయా పోస్టును రెండు వేల మంది షేర్ చేశారని, వారందరిపైనా ఇదే తరహా చర్యలు తీసుకుంటున్నారా? అని స్మితా సబర్వాల్ ప్రశ్నించారు. కొందరినే టార్గెట్ చేయడం ఆందోళనకరంగా పేర్కొన్నారు. ఇలా చేస్తే చట్టం ముందు సమానత్వం అనే అంశంలో రాజీపడినట్లుగా అర్థమవుతోందని ఆమె తన ఎక్స్ ఖాతాలో పేర్కొనడం సహజంగానే తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ చర్చ రాజకీయంగానే కాదు, అధికార వర్గాల్లోనూ భిన్నవాదనలకు తావు కల్పిస్తోంది.
నిజానికి ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసే అధికారులకు ‘కోడ్ ఆఫ్ కండక్ట్’ (ప్రవర్తనా నియమావళి) ఉంటుంది. అయితే ఈ ప్రవర్తనా నియమావళిని స్మితా సబర్వాల్ ఉల్లంఘించారా? అనే ప్రశ్నపైనా భిన్న వాదనలు సాగుతున్నాయి. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టును ఆమె రీట్వీట్ మాత్రమే చేశారని, తానే స్వయంగా ఆ పోస్టును క్రియేట్ చేయలేదని ఓ రిటైర్డ్ అదనపు ఎస్పీ ‘సమీక్ష’ న్యూస్ తో వ్యాఖ్యానించారు. అయితే ప్రభుత్వ సర్వీసులో ఉన్నపుడు ఇటువంటి పోస్టులు చేయడం ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించినట్లుగా భావించాల్సి ఉంటుందని మరో ఉన్నతాధికారి అభిప్రాయపడడం గమనార్హం. అయితే ప్రభుత్వ అధికారి అయినంత మాత్రాన తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం ఉండకుండాపోదని, స్మితా సబర్వాల్ చేసిన పోస్టు భావ ప్రకటనా స్వేచ్ఛగా పరిగణించాల్సి వస్తుందని మరో అధికారి పేర్కొనడం గమనార్హం.

ఇదే దశలో స్మితా సబర్వాల్ పేరును ఎక్కడా ప్రస్తావించకుండానే సీఎం చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సీపీఆర్వో) భోరెడ్డి అయోధ్యరెడ్డి ఎక్స్ ఖాతాలో స్పందించారు. ఆ ఐఏఎస్ అధికారి ‘దృష్టికోణం’లో మార్పు ఎందుకొచ్చినట్టు..?? అధికార మార్పిడి జరిగితే అభిప్రాయాలూ మారొచ్చా..?? అప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా అడవులను నరికేయించిన, వన్యప్రాణులను తరిమిన (సీఎంవోలో ఇరిగేషన్ బాధ్యతలు నిర్వహించిన) వీరే.. ఇప్పుడు తప్పు పట్టడంలో మర్మం ఏందో..?? అసలు ఏడుపు వన్యప్రాణుల కోసమా..?? అధికారం కోల్పోయినవారి కోసమా..?? ఇవీ కొన్ని ఉదాహరణలు.. అంటూ కొన్ని పత్రికల క్లిప్పింగులను అయోధ్యరెడ్డి తన ఎక్స్ ఖాతాలో జత చేశారు.

వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్మితా సబర్వాల్ కీలక స్థానంలో బాధ్యతలు నిర్వహించారు. ఆమెకు అప్పటి ప్రభుత్వంలో లభించిన ప్రాధాన్యతకు అధికార వర్గాలే కొన్ని ఉడుక్కున్నాయంటే అతిశయోక్తి లేకపోవచ్చు. అంతకు ముందు వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా, ఆతర్వాత కరీంనగర్ , మెదక్ జిల్లాల కలెక్టర్ గా పని చేశారు. ఆయా స్థానాల్లో విధులు నిర్వహించిన స్మితా సబర్వాల్ సమర్థవంతమైన అధికారిగా పేరుగాంచారు. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో స్మితా సబర్వాల్ తొమ్మిదేళ్లపాటు సీఎంవోలో కీలక బాధ్యతలను నిర్వహించారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్మితా సబర్వాల్ అనేక అంశాల్లో వేర్వేరు సందర్భాల్లో చేసిన పోస్టులు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా మంత్రి సీతక్క ముందు కాలు మీద కాలేసుకుని కూర్చున్న ఘటన, నకిలీ వైకల్యపు సర్టిఫికెట్ల అంశంలో ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ ఘటనలో, లైంగికదాడి, హత్యోదంతంలో మధ్యప్రదేశ్ కోర్టు ఇచ్చిన తీర్పు తదితర అంశాలపై సోషల్ మీడియా వేదికగా స్మితా సబర్వాల్ చేసిన పోస్టులపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి.
తాజాగా కంచ గచ్చిబౌలి భూముల అంశంలో స్మితా సబర్వాల్ చేసిన రీట్వీట్, పోలీసుల నోటీసులు, ఆ తర్వాత ఆమె స్పందించిన తీరుపైనా తీవ్ర చర్చ జరుగుతోంది. ఆయా పరిణామాల నేపథ్యంలో రాజకీయంగానూ చర్చ జరుగుతుండడం విశేషం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సీఎంవోలో కీలక అధికారిగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ కంచ గచ్చిబౌలి భూముల అంశంలో చేసి రీట్వీట్ ప్రస్తుత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ఉందనే వార్తల నేపథ్యంలో ఈ చర్చ జరుగుతుండడం గమనార్హం. భవిష్యత్తులో స్మితా సబర్వాల్ రాజకీయ రంగంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయా? అనే ప్రశ్న ప్రామాణికంగా భిన్నకోణాల్లో ఇటువంటి చర్చ జరుగుతోంది.

రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రాజకీయ వర్గాలు ఉటంకిస్తున్నాయి. రేపటి తెలంగాణాకోసం మహిళా నాయకత్వాన్ని సిద్ధం చేద్దామని కేసీఆర్ పిలుపునిచ్చారు. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరముందని కూడా కేసీఆర్ స్పష్టం చేశారు. మెదక్ కలెక్టర్ గా పనిచేసిన వెంకట్రాంరెడ్డి, ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి ఉన్నతాధికారులు ప్రస్తుతం బీఆర్ఎస్ లోనే ఉండడం గమనార్హం. హెల్త్ డైరెక్టర్ గా పనిచేసిన గడల శ్రీనివాసరావు వంటి అధికారులు గత ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ టికెట్ కోసం విఫలయత్నం చేశారు. ప్రభుత్వ అధికారులను రాజకీయంగా ప్రోత్సహించడంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రత్యేకతను చాటుకోగా, కేసీఆర్ సైతం అనేక మంది అధికారులకు గులాబీ జెండా కప్పారు.