గులాబీ పార్టీలొ రాజకీయం రసవత్తరంగా మారుతోందా? తాజా పరిణామాలు ఇదే అంశాన్ని వెల్లడిస్తున్నాయా? బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిల మధ్య చోటు చేసుకుంటున్న వ్యాఖ్యల నేపథ్యపు దుమారం మున్ముందు ఆ పార్టీలో ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుంది? ఇదీ తెలంగాణా రాజకీయాల్లో జరుగుతున్న తాజా చర్చ. ఈ ఇద్దరు గులాబీ పార్టీ లీడర్ల మధ్య వివాదం ‘లిల్లీపుట్, జోహార్లు’ అనే పదాల ప్రస్తావన స్థాయికి వెళ్లడం గమనార్హం. అయితే ఈ రెండు కీలక పదాల మధ్య కవిత ప్రస్తావించిన పార్టీలోని ‘పెద్ద నాయకుడు’ ఎవరనేదే ఇప్పుడు గులాబీ పార్టీ కేడర్ లోనే కాదు, మిగతా రాజకీయ పక్షాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారడం విశేషం.
కల్వకుంట్ల కవిత ఏమంటున్నారు..? ఇంటి ఆడబిడ్డగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి విషయంలో తెలంగాణా యావత్తూ బాధపడిందని, ఎక్కడికక్కడ స్పందించిందని, కానీ బీఆర్ఎస్ లో ఉన్న అన్నదమ్ములెవరూ స్పందించలేదని ఆమె బాధపడిపోయారు. ‘ఇపుడు ఏం జెప్పాలన్నా నీకు నా బాధ?’ అంటూ జగదీష్ రెడ్డి తనపై చేసినట్లు పేర్కొంటున్న వ్యాఖ్యలపై విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కవిత ఆదివారం రియాక్టయ్యారు. నిర్దిష్టమైన సమాచారంతోనే తాను చెబుతున్నానని, తనపై అనుచిత వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ లో ‘పెద్ద నాయకుడు’ హష్తముందని, అందువల్లే బీఆర్ఎస్ లో ఎవరూ రియాక్ట్ కాలేదని తాను బలంగా నమ్ముతున్నట్లు కూడా కవిత పేర్కొన్నారు. అంతేకాదు తనపై కుట్రలు చేసిన ‘పెద్ద నాయకుడు’ చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నాడని కూడా ఆమె అన్నారు. కానీ ఆ పెద్ద నాయకుడి గురించి కూడా తనకు తెలుసని, ఏ టైంలో ఎవరిని కలిశారో, తనపై వ్యాఖ్యలు చేసేందుకు ఎవరిని ప్రోత్సహించారో, ఎంత కిందిస్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డమీద వ్యాఖ్యలు చేయించారో తనకు తెలుసన్నారు. తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని, ఇవ్వాళ నన్ను ఒంటరిని చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు, వ్యాఖ్యలు చేయించి శునకానందం పొందవచ్చు, కానీ దేవుడనేవాడు ఉన్నాడని కవిత అన్నారు.

ఇదే సందర్భంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత ‘లిల్లీపుట్’గా అభివర్ణించారు. అతని వల్లే నల్లగొండ జిల్లాలో పార్టీ నాశనమైందన్నారు. చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా స్వల్ప మెజారిటీతో జగదీష్ రెడ్డి గెలిచారని, ఆ జిల్లాలో పార్టీ దుస్థితికి జగదీష్ రెడ్డే కారణమని కవిత నిందించారు. ‘ఆమె ఎవరు? ఈమె ఎవరు? అంటూ వ్యాఖ్యానించారని, జగదీష్ రెడ్డి ప్రజా ఉద్యమాలు చేయలేదని, కేసీఆర్ లేకుంటే నువ్వెవరు? అసలెవరు మీరు?’ అని కవిత ప్రశ్నించారు. అదేవిధంగా ఓ చిన్న పిల్లగాడు కూడా తనపై కామెంట్లు చేశారని, తెలంగాణా ఉద్యమంతో అతనికి సంబంధమేంటి? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పార్టీలోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడుతరా? అని కవిత మరో నాయకునిపై విరుచుకుపడ్డారు. కవిత చేసిన ‘లిల్లీపుట్’ వ్యాఖ్యపై సహజంగానే చర్చ జరుగుతోంది. జోనాథన్ స్విఫ్ట్ రాసిన ‘గలివర్స్ ట్రావెల్స్’ అనే పుస్తకంలో ప్రస్తావించిన కల్పిత దేశంలో ఆరు అంగుళాల ఎత్తు గల చిన్న చిన్న మనుషులు నివసిస్తారు. ఇటువంటి సూక్ష్మ ఎత్తులో గల మనుషులను ‘లిల్లీపుట్’లుగా అభివర్ణిస్తారు. దీంతో జగదీష్ రెడ్డి ఎత్తును ఉద్దేశించి అతన్ని బాడీ షేమింగ్ చేసే విధంగా కవిత ‘లిల్లీపుట్’ పదాన్ని వాడారనే అభిప్రాయాలు గులాబీ పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతున్నాయి.

కవిత తనపై చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ధీటుగానే స్పందించారు. తన ఉద్యమ ప్రస్ధానానికి సంబంధించి ‘వారి జ్ఞానానికి నా జోహార్లు’ అని జగదీష్ రెడ్డి కవితను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. కేసీఆర్ విరోధులు, బద్ధశత్రువులైన రేవంత్ రెడ్డి, వేమూరి రాధాక్రిష్ణల వ్యాఖ్యలనే కవిత వల్లె వేశారని కూడా జగదీష్ రెడ్డి ఆరోపించారు. నల్లగొండ జిల్లాలో పార్టీ నాశనం కావడానికి తానే కారణమనే కవిత వ్యాఖ్యపై స్పందిస్తూ, గతంలో జిల్లాలోని 12 సీట్లను పార్టీ గెలవడానికి తాను కారణమైతే, ప్రస్తుత స్థితికి కూడా తానే కారకునిగా ఉటంకించారు. ‘కొన్ని చోట్ల వాళ్ల సొంత సీట్లలో ఓడిపోయారు, దానికేం కారణం చెప్తారు?’ అని కూడా జగదీష్ రెడ్డి నిలదీశారు. సొంత సీట్లలో ఓడిపోయారని జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల అర్థం, పరమార్ధంపైనా భిన్న చర్చ జరుగుతోంది.

అయితే జగదీష్ రెడ్డి వాడిన ‘జోహార్లు’ పదంపైనా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాధారణంగా విప్లవకారులు అమరులైన సందర్భాల్లో వారికి నివాళులు అర్పించే సమయంలో ‘జోహార్ కామ్రేడ్’ అని విప్లవోద్యమ అభిమానులు నినదిస్తారు. కానీ ‘జోహార్’ అంటే నమస్కారం, స్వాగతం అనే పర్యాయ అర్థాలు కూడా ఉన్నాయి. ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్ తదితర రాష్ట్రాలలో నమస్కరించే సందర్భంలో ఎక్కువగా ‘జోహార్’ పదాన్నే ఉపయోగిస్తారు. దీంతో తన ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవిత చేసిన వ్యాఖ్యలకు స్పందనగా జగదీష్ రెడ్డి వెటకారపు ‘నమస్కారం’ తెలిపే ఉద్ధేశంతోనే ‘జోహార్లు’ అనే పదాన్ని ఉపయోగించి ఉంటారనే వాదన వినిపిస్తోంది. మొత్తంగా కవిత, జగదీష్ రెడ్డిల పరస్పర వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్ కూతురుపై అనుచిత వ్యాఖ్యల వెనుక గల ‘పెద్ద నాయకుడు’ ఎవరనే అంశంపైనే బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర చర్చ జరుగుతుండడం ఆసక్తికర అంశం.