గజ్వేల్: ఇద్దరు తెలంగాణా మహిళా మంత్రులను బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆత్మీయంగా పలకరించారు. తన ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు మహిళా మంత్రులకు కేసీఆర్ సాదరంగా ఆహ్వానం పలికారు. అతిథి మర్యాదలతో, పసుపు- కుంకుమ, చీర, తాంబూలాలతో ఆడబిడ్డలుగా గౌరవిస్తూ సంప్రదాయ సత్కారం చేశారు. రాష్ట్ర దేవదాయ, ధర్మదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి సీతక్క అనసూయ గురువారం ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫాం హౌజ్ కు వెళ్లిన సందర్భంగా చోటు చేసుకున్న దృశ్యమిది.

ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న మేడారం మహా జాతరకు రావాలని కోరుతూ ప్రభుత్వం తరపున మంత్రులు సీతక్క, సురేఖలు కేసీఆర్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా శాలువాకప్పి, ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు కేసీఆర్ కు మేడారం వనదేవతల మొక్కుబడి రూపంలో బంగారంగా అభివర్ణించే బెల్లం ప్రసాదాన్ని అందజేశారు. తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ ‘బాగున్నారా.. అమ్మా? అంటూ ఇద్దరు మంత్రులను పలకరించారు.

కాగా ఈ సందర్భంగా కేసీఆర్-శోభమ్మ దంపతులు అందించిన తేనీటి విందును స్వీకరించిన మహిళా మంత్రులు పరస్పర యోగ, క్షేమాలను అడిగి తెలసుకున్నారు. కాసేపు ఇష్టాగోష్టి అనంతరం మంత్రులు తిరుగు పయనమయ్యారు. కేసీఆర్ ఫాంహౌజ్ కు మంత్రులు వస్తున్నట్లు తెలుసుకున్న మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ వారికి ఎదురేగి సాదర స్వాగతం పలికారు.


