తండ్రి చెంతకు తనయ చేరింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎట్టకేలకు తనకు దేవుడైన తన తండ్రి కేసీఆర్ ను బుధవారం దర్శనం చేసుకున్నారు. ‘డాడీ’ .. అంటూ పార్టీ రజతోత్సవ సభ అనంతర పరిణామాలపై కేసీఆర్ కు కవిత రాసిన లేఖ రాజకీయంగా ఎంతటి చర్చకు దారి తీసిందో తెలిసిందే. కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని కూడా కవిత మీడియాతో వ్యాఖ్యానించారు. కవిత లేఖ అనంతర పరిణామాలపై కేసీఆర్ నారాజ్ గా ఉన్నారని, తన కూతురు కవితను కలిసేందుకు విముఖంగా ఉన్నారనే సారాంశంతో పలు వార్తా కథనాలు వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలోనే కవిత బుధవారం కేసీఆర్ ను కలవడం విశేషం. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ బయలుదేరుతుండగా ఎమ్మెల్సీ కవిత తన భర్తతో కలిసి ఎర్రవల్లిలోని ఫాం హౌజ్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ తో కవిత కీలక భేటీ జరిగిందనే సమాచారం వస్తోంది. తండ్రీ, తనయల మధ్య జరిగిన ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటన్నది మాత్రం తెలియరాలేదు.

కాగా కాళేశ్వరం కమిషన్ విచారణకు బయలుదేరిన కేసీఆర్ వెంట తొమ్మిది మంది పార్టీ నేతలు వెళ్లారు. వారిలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మధుసూదనాచారి, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, టి. పద్మారావు, మహమూద్ ఆలీ, బి. లక్ష్మారెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు.

