కర్నాటక రాష్ట్రంలోని హసన్ అనే జిల్లాలో చోటుచేసుకుంటున్న ఆకస్మిక గుండెపోట్ల మరణాలు అక్కడి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. గడచిన 40 రోజుల్లోనే 18 మంది గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేశాయి. దాదాపు 18 లక్షల జనాభా గల హసన్ జిల్లాలోనే ఈ తరహా మరణాలు వరుసగా చోటు చేసుకుంటుండడాన్ని ప్రభుత్వం తీవ్రంగానే పరిగణిస్తోంది. అందువల్లే హసన్ జిల్లాలో అసలేం జరుగుతోంది? అక్కడి గుండెపోట్ల ఘటనలకు కారణాలేంటి? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించడం గమనార్హం.
హసన్ జిల్లాలోని హోళెనరసీపర తాలూకా సోమనహళ్లికి చెందిన సంజయ్ అనే యువకుడు తన ఫ్రెండ్స్ తో కలిసి గత సోమవారం పార్టీకి వెళ్లాడు. ఉన్నట్టుండి బీపీ పెరిగి ఛాతీలో నొప్పి మొదలైంది. అప్రమత్తమైన సంజయ్ స్నేహితులు అతన్ని వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. సంజయ్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కేవలం ఓ ఉదాహరణ మాత్రమే. గడచిన కొన్ని నెలలుగా హసన్ జిల్లాలో జరుగుతున్న ఇటువంటి అనేక ఘటనలు కర్నాటక ప్రభుత్వాన్ని కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.

ఈ ఘటనలపై కర్నాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు దర్యాప్తునకు ఆదేశించారు. కేవలం నెల వ్యవధిలోనే 18 ఇటువంటి కేసులు నమోదయ్యాయయని, ఇందుకు కారణాలను అన్వేషించడానికి అధ్యయనాన్ని ప్రారంభించినట్లు మంత్రి ట్విట్టర్ వేదికగా ధ్రువీకరించారు. ఆకస్మిక గుండెపోట్లను తగ్గించే లక్ష్యంతో పునీత్ రాజ్ కుమార్ హృదయ జ్యోతి పథకం ద్వారా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయితే హసన్ జిల్లాలో చోటు చేసుకుంటున్న ఈ గుండెపోట్లపై పరిశోధనాత్మక చర్యలు అవసరమని మంత్రి పేర్కొన్నారు.

మరోవైపు హసన్ జిల్లాలో వరుసగా చోటు చేసుకుంటున్న గుండెపోటు మరణాలపై సీఎం సిద్దరామయ్య కూడా స్పందించారు. ఇందుకు గల కారణాలేమిటో తెలుసుకోవాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని హార్ట్ హాస్పిటల్స్ డైరెక్టర్ రవీంద్రనాథ్ ను ఆదేశించారు. ఈయన నేతృత్వంలోనే ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి పదిరోజుల్లో నివేదిక సమర్పించాలని సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు. సాధారణంగా గుండెపోట్లకు ధూమపానం, మద్యపానం, పొగాకు నమలడం, ఒత్తిడి, ఊబకాయం, జన్యు సంబంధిత అంశాలను ఎక్కువగా పరిగణనలోకి తీసుకుని వైద్యనిపుణులు విశ్లేషిస్తుంటారు. కానీ హసన్ జిల్లాలో జరుగుతున్న వరుస గుండెపోటు ఘటనలు మాత్రం పలు ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా హసన్ జిల్లాలో చోటుచేసుకుంటున్న గుండెపోట్లపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య నిన్న తన ట్విట్టర్ ఖాతా ‘ఎక్స్’ వేదికగా చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాష్టంలోని యువత ఆకస్మిక మరణాలకు గల కారణాలు, కోవిడ్ వ్యాక్సిన్లు ఏదేని ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయా? అనే అంశంపై అధ్యయనం చేయాలని గత ఫిబ్రవరిలో ఇదే కమిటీకి ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రజల జీవితాలను తాము కూడా విలువైనవిగానే భావిస్తామని, కానీ రాజకీయ ప్రయోజనాలకోసం ఇటువంటి అంశాలను వినియోగించుకుంటున్న బీజేపీ నాయకుల చర్యలు ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ను తొందరపాటుతో ఆమోదించడం, ప్రజలకు పంపిణీ చేయడం కూడా ఈ మరణాలకు ఒక కారణం కావచ్చనేది తిరస్కరించలేమని సీఎం సిద్ధరామయ్య తన ‘ఎక్స్’ పోస్టులో వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక అధ్యయనాలు పెరుగుతున్న గుండెపోట్లకు కోవిడ్ వ్యాక్సిన్లు కారణమని సూచించాయని, ఈ అంశంలో తమను విమర్శించే ముందు బీజేపీ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. సిద్దరామయ్య ట్విట్టర్ పోస్టును దిగువన చూడవచ్చు.
Update:
కాగా సిద్ధరామయ్య వ్యాఖ్యలను కేంద్రం ఖండించింది. ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్లతో సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. గుండెపోటు మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లే కారణమని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సిద్ధరామయ్య వ్యాఖ్యలను కేంద్రం కొట్టిపారేసింది. అంతర్లీన ఆరోగ్య సమస్యలు, ప్రమాదకర జీవన శైలి, జన్యపరమైన కారణాల వల్లే గుండెపోటు మరణాలు సంభవిస్తాయని కేంద్రం పేర్కొంది. గుండెపోటు మరణాలకు, వ్యాక్సిన్లకు సంబంధం లేదన్న విషయాలను ICMR, AIIMS అధ్యయనాలు వెల్లడించాయని కేంద్రం ఈ సందర్భంగా గుర్తు చేసింది.