‘అన్నా.., మీరు అనుకుంటున్నట్లు, జనంలో ప్రచారం జరుగుతున్నట్లు నాదేమీ లేదిక్కడ. నేను వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి యాక్టివిటీ వాళ్లకు తెలుస్తుంది. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతుంది. నేను ఇక్కడ రూపాయి తిన్నా కూడా అక్కడ లెక్క తెలుస్తుంది. నేను ఏది చేసినా అక్కడికి వెంటనే సమాచారం వెళ్లిపోతుంది. వాళ్లకు తెలియకుండా నేను ఏమీ చేయలేననే విషయాన్ని మీరు తెలుసుకోవాలి’
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉత్తర తెలంగాణాకు చెందిన ఓ మంత్రి తరచూ ఇదే విషయాన్ని చెబుతుండేవారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు గాని, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు గాని తెలియకుండా ఇక్కడేమీ జరగదనే భావనతో ఆ మంత్రి తరచూ అదే అంశాన్ని ప్రస్తావించేవారు. తాను నిమిత్తమాత్రుడిని మాత్రమేనని చెబుతుండేవారు. ఇప్పుడీ ప్రస్తావన దేనికంటే..
గులాబీ కోటలో రాజకీయ ఘర్షణ తారా స్థాయికి చేరుకుంటున్నట్లే కనిపిస్తోంది. పక్క పార్టీకి వెళ్లేందుకు సిద్ధపడిన ఎవరో లీడర్ కాదు.., సాక్షాత్తూ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబంలోని సభ్యురాలే ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. డాడీ స్థాపించిన పార్టీలో ఏం జరుగుతోందో చెప్పకనే చెబుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ బంధాన్ని బహిర్గతం చేస్తున్నారు. ఆ రెండు పార్టీలు కుమ్ముక్కయ్యాయనే ప్రత్యర్థి పార్టీల నాయకుల ఆరోపణలకు గులాబీ పార్టీ కోటలోని సభ్యురాలే తన వ్యాఖ్యల ద్వారా బలం చేకూరుస్తున్నారు. పిడికెడు మందితో ఉద్యమాన్ని ప్రారంభించి ప్రత్యేక రాష్ట్ర సాధనలో తనదైన కీలక పాత్రను పోషించి పదేళ్ల పాలకునిగా ప్రత్యేక ముద్ర వేసుకున్న పెద్దమనిషి కేసీఆర్ తాజా పరిణామాల్లో నిశ్చేష్టునిగా, నిస్సహాయునిగా చూస్తున్నారా? ఇదీ బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న తాజా చర్చ. ఇంతకీ బీఆర్ఎస్ లో ఈ పొలిటికల్ లొల్లి ఏంది?

కేసీఆర్ గారాల తనయ కల్వకుంట్ల కవిత నిన్న మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఏమన్నారు? తాను జైలులో వున్నప్పుడే కుట్రకు తెర తీశారన్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపే కుట్ర జరుగుతోందన్నరు. ఆడబిడ్డకు గౌరవం లేదా? అని ప్రశ్నించారు. పెయిడ్ ఆర్టిస్టులతో నన్ను తిట్టిస్తారా? అని నిలదీశారు. బీజేపీ నేతల ఆసుపత్రి ఓపెనింగ్ కు వెళ్లిందెవరని ప్రస్తావించారు. కేసీఆర్ లాగే తనకూ కొంచెం తిక్క ఉందన్నారు. తాను నోరు తెరిస్తే తట్టుకోలేరని వార్నింగ్ కూడా ఇచ్చారు. ముఖ్య నాయకులు ట్వీట్లకే పరిమితమైతే ఎలా? అని ఎవరిని ఉటంకిస్తూ వ్యాఖ్యానించారో తెలంగాణా సమాజానికి తెలిసిపోయింది. కేసీఆర్ మాత్రమే తన నాయకుడని, ఇతరులెవరి కిందా తాను పని చేయనని చేసిన వ్యాఖ్యల భావమేంటో స్పష్టమైనట్లుగానే రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. మొత్తంగా కల్వకుంట్ల కవిత తాాజా వ్యాఖ్యల రాజకీయ రచ్చ ప్రకంపనలు రేపుతోంది.

నిన్నటి చిట్ చాట్ లో కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యల సారాంశమేంటో సుస్పష్టం. కేటీఆర్ నాయకత్వాన్ని ఆమె అంగీకరించడం లేదనే విషయం తేటతెల్లమైంది. పార్టీలో తన స్థానమేంటో తేల్చాలని పరోక్షంగానే కాదు, ప్రత్యక్షంగానూ తండ్రిని డిమాండ్ చేస్తున్నట్లుగానే భావించవచ్చు. పార్టీ ఫోరంలో ఏముంది? పబ్లిక్ గానే మాట్లాడుతానని మొన్న కేటీఆర్ నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలకు నేరుగానే కౌంటర్ ఇచ్చారు. తన తండ్రి నుంచి తనను వేరుచేసే కుట్ర జరుగుతోందని కూడా కవిత అన్నారు. తండ్రీ, కూతుళ్లను ఎవరు వేరు చేస్తున్నారనే పెద్ద ప్రశ్నకు ఆస్కారం కలిగించారు. కేటీఆర్, హరీష్ రావులే లక్ష్యంగా కవిత వ్యాఖ్యలున్నాయనే సారాంశంతో వార్తా కథనాలు కూడా వెలువడ్డాయి.

కవిత తాజా వ్యాఖ్యల పరిణామాల్లో మొత్తంగా తేలిందేమిటి? అన్న, చెల్లెలి మధ్య రాజకీయ ఆధిపత్యం జరుగుతోందనే అంశం బట్టబయలైంది. అయితే ఈ రాజకీయ వైరం అన్నా చెల్లెలి వరకే పరిమితమైందా? ఈ అంశానికి సంబంధించి పార్టీలో కీలక నాయకులుగా ప్రాచుర్యం పొందిన హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్ ల పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలపై గులాబీ పార్టీ వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో గల చంద్రబాబును విభేదించి, ఎదిరించి, పార్టీని స్థాపించి, ఉద్యమాన్ని నడిపించి, రాష్ట్రాన్ని సాధించి, పదేళ్లు తెలంగాణాను పాలించిన పార్టీ చీఫ్ కేసీఆర్ తన కూతురు, కొడుకుల మధ్య ఏర్పడిన ఈ అగాధంపై మిన్నకుండడమేంటి? అనే ప్రశ్నపైనా తీవ్ర చర్చ జరుగుతోంది. కొడుకా? కూతురా? కేసీఆర్ ఎటువైపు మొగ్గు చూపుతారు? ఆయన ముందున్న కర్తవ్యమేంటి? కవిత వ్యాఖ్యలు, వైఖరి కారణంగా పార్టీకి జరుగుతున్న నష్టనివారణ చర్యలపై కేసీఆర్ ఎలా స్పందిస్తారు? అనే అంశంపైనా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
తొలి పేరాలో ప్రస్తావించిన అంశం ప్రకారం.. జిల్లాల్లో మంత్రుల ప్రతి కదలికలపై నిఘా వేసిన వారు పార్టీలో చోటు చేసుకున్న తాజా పరిణామాల సంకేతాలను ముందుగానే ఎందుకు గుర్తించలేకపోయారు? పార్టీ చీఫ్ కేసీఆర్ మాత్రమే కాదు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఎందుకు పసిగట్టలేకపోయారు. కన్న కూతురే వినిపిస్తున్న ధిక్కార స్వరంపై స్పందించకుండా ఫాం హౌజ్ లో తీవ్రంగా యోచిస్తున్నట్లు భావిస్తున్న కేసీఆర్ వైఖరిపై సొంత పార్టీ నాయకుల్లో ఆందోళన కలగడం కూడా సహజమే. రాజకీయ భవితపై భయాందోళన కలగడం కూడా సాధారణమే. పార్టీ చీలుతుందా? నిలబడుతుందా? అనే డోలాయమాన స్థితిని బీఆర్ఎస్ లోని అనేక మంది నాయకులు తాజాగా ఎదుర్కుంటున్నారనేది కాదనలేని వాస్తవం. ఒకానొక సోర్స్ ప్రకారం.. ఈ అంశంలో అటు కేటీఆర్ ను, ఇటు హరీష్ రావును, ఇంకోవైపు జోగినపల్లి సంతోష్ కుమార్ ను కేసీఆర్ కనుసైగతోనే నిలువరించినట్లు తెలుస్తోంది. కవిత విషయంలో ఆచి తూచి వ్యవహరించాలని ఆయన ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది.

మొత్తంగా గులాబీ పార్టీ కోటలో జరుగుతున్న రాజకీయ ‘ఘర్షణ’ తెలంగాణా రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్. ఈ అంశంలో కేసీఆర్ ఏం చేయబోతున్నారు? అనే అంశంపైనే పొలిటికల్ సర్కిళ్లలో భిన్న కోణాల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. మరోవైపు ‘కారు’ పార్టీలో నెలకొన్న పరిస్థితులు, పరిణామాలపై కేసీఆర్ వల్ల అనేక చేదు అనుభవాలను చవి చూసిన ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డిలు లోలోన మస్త్ ఖుషీ అవుతున్నట్లేనా?