బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెల 5వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తీరుతెన్నులపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆదేశించినట్లు సమాచారం. కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ కు కూడా కాళేశ్వరం కమిషన్ నుంచి పిలుపు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. జూన్ 6వ తేదీన హరీష్ రావు, 9వ తేదీన ఈటెల రాజేందర్ తమ ఎదుట విచారణకు హాజరు కావాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పేర్కొన్నట్లు ప్రచారపు సారాంశం.
కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బరాజ్ ల నిర్మాణపు తీరుతెన్నులపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన పరిణామాల్లో అన్నారం, సిందిళ్ల బ్యారేజీలపై విచారణ కోసం న్యాయ విచారణ కమిషన్ ను తెలంగాణా ప్రభుత్వం నియమించింది. నిరుడు మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్ కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వం వహిస్తున్నారు.

బీఆర్ఎస్ తొలిసారి అధికారంలో కేసీఆర్ సీఎంగా, ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రిగా, హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉండగా, రెండో దఫాలోనూ కేసీఆర్ సీఎంగా, హరీష్ రావు మాత్రం ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. రెండోసారి అధికారంలోకి వచ్చినపుడు ఇరిగేషన్ శాఖను కేసీఆరే చూసేవారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన కమిషన్ విచారణ గడువును ఇటీవలే పొడిగించారు. ఇప్పటి వరకు జరిపిన విచారణలో సీనియర్ ఇంజనీర్ల, అధికారుల నుంచి వాంగ్మూలాలను రికార్డు చేశారు. ఈ నేపథ్యంలోనే రెండుసార్లు సీఎంగా వ్యవహరించిన కేసీఆర్ ను, ఇరిగేషన్, ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీష్ రావును, కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ ను కూడా విచారించేందుకు కాళేశ్వరం కమిషన్ సంసిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ లకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ ముగ్గురు నాయకులను విచారించిన అనంతరం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుందని భావిస్తున్నారు. కాగా కాళేశ్వరం కమిషన్ నుంచి తనకు ఎటువంటి నోటీసులు అందలేదని మాజీ మంత్రి హరీష్ రావు చెబుతున్నారు. ప్రస్తుతం హరీష్ రావు సిద్ధిపేటలో ఉండగా, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో ఉన్నారు.