ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని విపక్ష పార్టీలు ప్రకటించాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఈమేరకు ప్రకటన చేశారు. విపక్ష పార్టీలన్నీ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి మద్ధతు తెలిపినట్లు ఆయన వెల్లడించారు. జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి దేశంలోని ప్రఖ్యాత న్యాయ నిపుణుల్లో ఒకరిగా ప్రసిద్ధి గాంచారు.
జస్టిస్ సుదర్శన్ రెడ్డి 1984లో తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారంలో జన్మించారు. హైదరాబాదులో న్యాయ విద్యను అభ్యసించి ఉస్మానియా న్యాయ కళాశాల నుండి లా డిగ్రీ పొందారు. విద్యార్థి దశ నుండే న్యాయ వ్యవస్థపై అభిమానం, రాజ్యాంగ విలువలపై అవగాహన, సామాజిక న్యాయంపై నిబద్ధత బలంగా ఉన్నవ్యక్తి కావడం విశేషం. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా, గువాహటి చీఫ్ జస్టిస్ గా, సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పనిచేశారు. గోవా తొలి లోకాయుక్తగా 2013లో పదవీ బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏడు నెలలకే వ్యక్తిగత కారణాలతో ఆ పదవికి రాజీనామా చేశారు. వివిధ హోదాల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇచ్చిన తీర్పుల్లో రాజ్యాంగం పట్ల గౌరవం, ప్రజల హక్కుల పరిరక్షణ, పారదర్శక పాలనపై నిబద్ధత స్పష్టంగా కనిపిస్తుందని న్యాయవాద వర్గాలు ఈ సందర్భంగా కొనియాడాయి. కొన్నేళ్ల పాటు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) చైర్మన్ గా కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పనిచేశారు, సామాన్య ప్రజలకు న్యాయం అందించాలన్నలక్ష్యంతో ఆయన అనేక కార్యక్రమాలు నిర్వహించారు.

కాగా ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రకటించడం తెలుగు ప్రజల, ముఖ్యంగా తెలంగాణ ప్రజల గౌరవాన్ని పెంచిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈమేరకు ఆయన జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఓటు చోరీకి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఎన్డీఏ కూటమి ఒకవైపు, మహాత్ముడి స్ఫూర్తితో రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు పోరాడుతున్న ఇండియా కూటమి మరోవైపుగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. రాజకీయాలకతీతంగా వ్యవసాయ కుటుంబంలో జన్మించిన తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం గర్వకారణమన్నారు. ఆయనను గెలిపించాల్సిన బాధ్యత ప్రతీ తెలుగువాడిపై ఉందని, పీవీ నర్సింహారావు తరువాత ఒక తెలుగువాడిని ఆ స్థాయిలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం గర్వకారణమని సీఎం అన్నారు.
రాజకీయాలకతీతంగా మనం ఏకం కావాల్సిన సందర్భమన్నారు. తెలుగువాడికి దక్కిన గౌరవం ఉపరాష్ట్రపతి అభ్యర్థి ప్రకటనగా పేర్కొన్నారు. ఉభయ రాష్ట్రాల్లోని అన్ని పార్టీలకు తాను విజ్ఞప్తి చేస్తున్నానని, జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. చంద్రబాబు నాయుడు, కేసీఆర్, పవన్ కళ్యాణ్, కమ్యూనిస్ట్ సోదరులు, ఉభయ రాష్ట్రాల బీజేపీ ఎంపీలు సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు సీఎం రేవంత్ పేర్కొన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించాల్సిన అవసరం ఇప్పుడు ఉందన్నారు.
జస్టిస్ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదని, ఆయన ఇండియా కూటమి ప్రతిపాదించిన న్యాయనిపుణులని చెప్పారు. ఆయనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, ఆయన ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ అని, 1991 లో ప్రధాని రేసులో ఉన్న పీవీ నరసింహారావు నంద్యాల ఎంపీగా పోటీ చేసినపుడు ఆనాడు ఎన్టీఆర్ ఆయనపై పోటీ పెట్టకుండా మద్దతు పలికడం ద్వారా రాజకీయ విజ్ఞతను ప్రదర్శించారని గుర్తు చేశారు. ఈనాడు ఒక తెలుగువాడు ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు విజ్ఞత ప్రదర్శించాలని, మనమంతా ఏకమై ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.