Friday, October 17, 2025

Top 5 This Week

Related Posts

జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ షెడ్యూల్ విడుదల

ఢిల్లీ: హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నవంబర్ 11వ తేదీన ఈ స్థానానికి బై ఎలక్షన్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటింంచింది. ఉప ఎన్నిక ప్రక్రియలో భాగంగా ఈనెల 13న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈనెల 21వ తేదీ నామినేషన్ల దాఖలుకు తుదిగడువు కాగా, 22వ తేదీన నామినేషన్ల స్క్రూటినీ, నామినేషన్ల ఉపసంహరణకు 24వ తేదీని ఆఖరు గడువుగా విధించారు. నవంబర్ 11వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు నవంబర్ 14వ తేదీన చేపడతారు. ఇక్కడ గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.

కాగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్ తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వెంటనే పోస్టర్లు, బ్యానర్లను తొలగిస్తామన్నారు. నవంబర్ 11న పోలింగ్ జరుగుతుందని, ఆ తర్వాత 14న  కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోకవర్గంలో సుమారు 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారికి ఇంకా పది రోజుల వ్యవధి ఉందన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలున్నాయని, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే పార్టీలకు అతీతంగా కేసులు నమోదవుతాయని ఆర్వీ కర్ణన్ హెచ్చరించారు.

అదేవిధంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కూడా కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. నవంబర్ 6, 11 తేదీల్లో బీహార్ లో రెండు దఫాలుగా ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపును నవంబర్ 14వ తేదీన నిర్వహిస్తారు. బీహార్ లో ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వ పదవీ కాలం వచ్చే నెలాఖరున ముగుస్తుంది.

Popular Articles