హైదరాబాద్: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర సేవలను ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే వద్దిరాజు రవిచంద్రకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలోని యూసఫ్ గూడ డివిజన్ బాధ్యతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అప్పగించారు. ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ముఖ్య కార్యకర్తలతో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సమావేశమయ్యారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆశిష్ కుమార్ యాదవ్, మంగళారపు లక్ష్మణ్ తదితర ప్రముఖులకు పోలింగ్ స్టేషన్ల వారీగా కార్యకర్తలకు ఓటర్ల జాబితాలను అందజేసి బాధ్యతలను అప్పగించారు.
ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా బీసీలు ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు హామీలెన్నో ఇచ్చి ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడంతో రైతులు, విద్యార్థులు,యువకులు, మహిళలు, ఆటో కార్మికులు, ఉద్యోగులు,వ్యాపారులు ప్రభుత్వంపై మండిపడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రిజర్వేషన్స్ పెంపుదల పేరిట బీసీలను నమ్మించి మోసం చేశారని, ద్రోహం తలపెట్టారని విమర్శించారు.

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీసీల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడవని, హైదరాబాద్ నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేసిన, తెలంగాణను బంగారుమయంగా తీర్చిదిద్దిన కేసీఆర్ వైపు ప్రజలు చూస్తున్నారన్నారు. తమకు బీఆర్ఎస్ పార్టీనే దిక్కు ,కేసీఆరే తెలంగాణ జాతిపిత, దిక్సూచి అని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారని ఎంపీ వద్దిరాజు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఘన విజయం సాధిస్తారని, గులాబీ జెండా ఎగరడం ఖాయమని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం తథ్యమని ఎంపీ వద్దిరాజు స్పష్టం చేశారు.