దొంగల్లో రకాలుంటారు.. దోపిడీల్లోనూ భిన్న కోణాలుంటాయి. దొంగలు, దోపిడీ దొంగలు.., గజదొంగలు, బందిపోట్లు ఇలా రకరకాలు ఉంటారన్నమాట. అలాగే దోపిడీ ఘటనల్లో రాత్రిపూట చోరీలు, పట్టపగలు దోపిడీలు, తాళం వేసిన ఇళ్లకు కన్నాలు వేసి దొంగతనాలకు పాల్పడడం, దారి దోపిడీలు ఇలా అనేక రీతుల చోరీ ఉదంతాలు పోలీసుల క్రైం నివేదికల్లోని వివరాల్లో కనిపిస్తుంటాయి. కానీ ఓ ప్రముఖ పత్రిక విలేకరి స్కెచ్ తో సాయం సంధ్య వేళ టాస్క్ ఫోర్స్ పోలీసులే ఓ వ్యాపారిని దోచుకుంటే..? వాళ్లను ఎలా సంబోధించాలి? ఈ ఉదంతం ఏ కేటగిరీలోకి వస్తుందోగాని, ఓ ఏసీపీ స్థాయి అధికారి అటాచ్మెంట్ కు, ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల సస్పెన్షన్ కు దారి తీసిన ‘దోపిడీ’ ఘటన అద్యంతరం ఆసక్తికరం.. ఇక విషయంలోకి వెడితే..
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాజస్థాన్ కు చెందిన జితేందర్ గోయెల్ అనే వ్యక్తి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో ఖరీదుదారునిగా వ్యాపారం చేస్తున్నారు. మిర్చి కొనుగోళ్లు ద్వారా వ్యాపారం సాగిస్తూ మార్కెట్ లోని కమీషన్ దారులకు డబ్బు చెల్లిస్తుంటారు. ఇందులో భాగంగానే తన వద్ద గుమస్తాగా పనిచేసే వెంకన్న అనే వ్యక్తిని కమీషన్ దార్లకు నిత్యం చెల్లించాల్సిన డబ్బు కోసం విజయవాడకు పంపిస్తాడు. అతను విజయవాడలో తన సేటు (వ్యాపారి) నిర్దేశించిన సంస్థ నుంచో, మరో వ్యాపారి నుంచో రూ. 10.00 లక్షల నగదు బ్యాగులో తీసుకువస్తూ గత నెల 28వ తేదీన సాయంత్రం 5-6 గంటల మధ్య ఖమ్మం స్టేషన్ లో రైలు దిగుతాడు. అక్కడి నుంచి తన సేటు జితేందర్ గోయెల్ కు తన మొబైల్ ద్వారా ఫోన్ చేస్తాడు. వ్యాపార నిమిత్తం అప్పటికే రాజస్థాన్ లో గల జితేందర్ గోయెల్ గుమస్తాతో మాట్లాడుతూ, ఆ డబ్బును కోటి అనే వ్యక్తికి ఇవ్వాలని ఆదేశిస్తాడు. ఈ అంశంలో కోటిని కాన్ఫరెన్స్ కాల్ లోకి తీసుకుని జితేందర్ గోయెల్ మాట్లాడుతాడు కూడా.

అయితే తాను ప్రస్తుతం అందుబాటులో లేనని, రాత్రి గంటలకు ఖమ్మం వస్తానని, తనను త్రీ టౌన్ ప్రాంతంలో గల సుందరయ్య పార్కు వద్ద కలిసి డబ్బు అప్పగించాలని కోటి పేర్కొంటాడు. నిర్దేశించిన సమయానికి డబ్బు గల బ్యాగును తీసుకుని మిర్చి వ్యాపారి గుమస్తా వెంకన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో సుందరయ్య పార్కుకు వచ్చి కోటి కోసం ఎదురుచూస్తుంటాడు. కానీ కోటి రావడానికి ముందే రయ్..మంటూ టాస్క్ ఫోర్స్ పోలీస్ వాహనం అక్కడి వస్తుంది. ఇద్దరు కానిస్టేబుళ్లు నాగరాజు, ఉపేందర్ లు జీపులోంచి దిగి వెంకన్నను ప్రశ్నిస్తారు. ‘నీ బ్యాగులో గంజాయి ఉన్నట్లు సమాచారం ఉంది, చెక్ చేయాలి’ అని పోలీసుల సహజ ధోరణిలో అంటారు. తన బ్యాగులో గంజాయి ఎందుకు ఉంటుందని, తాను ఫలానా మిర్చివ్యాపారి వద్ద పనిచేసే గుమస్తానని, బ్యాగులో డబ్బు ఉందని, తన సేటు చెప్పిన వ్యక్తికి ఈ డబ్బు ఇవ్వడానికి ఇక్కడ ఉన్నట్లు వెంకన్న చెబుతాడు.
కానీ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదేమీ పట్టించుకోరు. బ్యాగును చెక్ చేయాల్సిందేనని పట్టుబడతారు. బ్యాగులో గంజాయి కనిపించదు..డబ్బు కట్టలు కనిపిస్తాయి. ఈ డబ్బుకు లెక్కలు చెప్పాలని పోలీసులు డిమాండ్ చేస్తారు. లెక్కలు తనవద్ద ఎందుకు ఉంటాయని, సేటు చెబుతాడని గుమస్తా వెంకన్న సమాధానమిస్తాడు. కానీ కానిస్టేబుళ్లు నాగరాజు, ఉపేందర్ పట్టించుకోరు. బ్యాగులో గల రూ. 10.00 లక్షల్లో నుంచి రూ. 6.00 లక్షలు తీసుకుని వెళ్లిపోతారు. జరిగిన ఘటనపై గుమస్తా వెంకన్న రాజస్థాన్ లో గల తన సేటు జితేందర్ గోయల్ కు వివరిస్తాడు. అక్కడ తన పనులు ముగించుకుని జితేందర్ గోయల్ ఈనెల 3వ తేదీన ఖమ్మం చేరుకుంటాడు. నాలుగో తేదీన ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులను కలిసి తన గుమస్తా వద్ద గల డబ్బు దోపిడీ ఘటనపై వివరిస్తాడు. ఛాంబర్ ప్రతినిధులు జితేందర్ గోయల్ ను వెంటేసుకుని త్రీటౌన్ పోలీస్ స్టేషన్ కు వెడతారు. డబ్బు తీసుకున్నది పోలీసులేనా? దోపిడీదారులా? కనుక్కుని వ్యాపారికి న్యాయం చేయాలని అభ్యర్థిస్తూ దోపిడీ జరిగిన తీరును వివరిస్తారు.

కానీ ఈ అంశంలో తమకు ఎటువంటి సంబంధం లేదని, విషయాన్ని త్రీ టౌన్ పోలీసులు ఉన్నతాధికారులకు నివేదిస్తారు. ఈలోగానే పోలీసుల దోపిడీ ఘటన లీకవుతుంది. రచ్చగా మారుతుంది. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఘటనపై విచారణకు ఆదేశిస్తారు. ఈ అంశంలో తనకు అందిన విచారణ నివేదిక ప్రకారం మిర్చి వ్యాపారి గుమస్తాను దోపిడీ చేసిన పోలీస్ కానిస్టేబుళ్లు ఉపేందర్ (డ్రైవర్), నాగరాజు (గన్ మెన్)లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే ఘటనలో విచారణ నివేదికలోని అంశాల ఆధారంగా సీటీసీ ఏసీపీగా పనిచేస్తున్న రవిని డీజీపీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడడం గమనార్హం. అత్యంత ఆసక్తికరంగా, సినిమా స్టోరీని తలపించే విధంగా ఉన్న ఈ కథనంలో హెడ్డింగ్ లోని విలేకరి పాత్రను వివరించలేదేంటి అనుకుంటున్నారా? అదే అసలు ట్విస్టు.
ఈ మొత్తం వ్యవహారంలో అసలు స్కెచ్ ఓ ప్రముఖ పత్రికలో పనిచేస్తున్న విలేకరిదే. ఆ పత్రికలో ఈ విలేకరి గతంలో వ్యవసాయ మార్కెట్ బీట్ చూస్తుండేవాడు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో ఈ విలేకరికి అత్యంత సన్నిహితుడైన మరో కమీషన్ వ్యాపారి ఉన్నాడు. మార్కెట్లో వ్యాపారం నిర్వహించే వారు ఏ సమయంలో, ఎక్కడి నుంచి డబ్బు తీసుకువస్తారు? ఏయే పట్టణాలు, నగరాల నుంచి ఆ డబ్బు వస్తుంది? అనే అంశాలపై ప్రముఖ పత్రిక విలేకరితోపాటు అతని సన్నిహిత కమీషన్ వ్యాపారికి మాంచి పట్టు ఉంది. ఈ దోపిడీ ఘటనలో జితేందర్ గోయెల్ గుమస్తా వెంకన్న భారీ మొత్తంలో డబ్బు తీసుకువస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందించింది ఆ ప్రముఖ పత్రిక విలేకరే. సుందరయ్య పార్కు వద్ద టాస్క్ ఫోర్స్ కానిస్టేబుళ్లు వెంకన్న బ్యాగు నుంచి రూ. 6.00 లక్షలు తీసుకుంటున్న సమయంలో దూరం నుంచి పరిస్థితిని సదరు ప్రముఖ పత్రిక విలేకరి గమనిస్తూనే ఉంటాడు. అంతేకాదు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకుల కదలికలను, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఘటన వరకు ప్రతి దృశ్యాన్ని గమనించి ఏసీపీ రవికి చేరవేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే విషయం రచ్చ అవుతుందని భావించి మిర్చి వ్యాపారి గుమస్తా వెంకన్న నుంచి దోపిడీ చేసిన రూ. 6.00 లక్షల్లో రూ. ఐదు లక్షలను ఆఘమేఘాల మీద తిరిగి వ్యాపారికి అప్పగించినట్లు పోలీసు అధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. మిగతా లక్ష రూపాయలను ఆ ప్రముఖ పత్రిక విలేకరి తనిచ్చిన సమాచారం ‘కష్టం’ కింద దోపిడీ జరిగిన నిమిషాల వ్యవధిలోనే తీసుకున్నట్లు పోలీసు అధికారుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. మొత్తంగా మిర్చి వ్యాపారి గుమస్తా నుంచి రూ. 6.00 లక్షల మొత్తాన్ని పోలీసులు దోచుకున్న పర్వంలో ఆద్యంతం స్కెచ్ ప్రముఖ పత్రిక విలేకరిది కాగా, దోపిడీ పాత్ర మాత్రమే ఇద్దరు కానిస్టేబుళ్లదిగా విచారణలో తేలినట్లు తెలుస్తోంది.
ఈ అంశంలో ప్రముఖ పత్రిక విలేకరికి, ఏసీపీ రవికి మధ్య గల సన్నిహిత సంబంధాలపై విచారణ నివేదిక ఆధారంగానే అతన్ని డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్తర్వు వెలువడినట్లు సమాచారం. ఇంతకీ ఈ దోపిడీ స్కెచ్ వేసిన వ్యక్తిపై చర్యలే లేవా.. అనుకుంటున్నారా? మొత్తం ఘటనలో లక్ష పోయినా మిగతా డబ్బు తిరిగి వచ్చిందని, ఇక పోలీసులతో పంచాయతీ ఎందుకులే.. అని మిర్చి వ్యాపారి జితేందర్ గోయల్, ఛాంబర్ నాయకులు భావించి ఫిర్యాదు చేయకపోవడం వల్ల విలేకరి ప్రస్తుతానికి ‘ఎస్కేప్’ అయ్యాడు. అయినప్పటికీ ఆ ప్రముఖ పత్రిక విలేకరి ప్రస్తుతం తన కష్టాల్లో తాను ఉన్నాడన్నది వేరే సంగతి. విషయం అర్థమైనట్లే కదా!