సమాజ హితాన్ని కోరాల్సిన విలేకరి వృత్తిలో గల ఓ వ్యక్తి వ్యవహార తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. విధివంచిన గిరిజన మహిళలను లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీకి చెందిన ఒకరిద్దరు నాయకుల అండదండలతో అతను ఆడుతున్న నాటకం నేషనల్ హైవేపై బహిర్గమైనట్లు చర్చ జరుగుతోంది. ఈనెల 21వ తేదీన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలానికి చెందిన ఓ ప్రముఖ పత్రిక విలేకరి నేషనల్ హైవేపై ఓ మహిళను కిడ్నాప్ చేసి, కారులో ఎక్కించుకుని వెళ్లినట్లు వచ్చిన వార్తలు తీవ్ర సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ ఘటనలో సీసీ ఫుటేజీ ఉన్నప్పటికీ, తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తల పరిణామాల్లో ప్రభుత్వ నిఘా వర్గాలు ఉన్నతాధికారులకు వివరణతో కూడి సమాచార నివేదికను అందించాయి. ఆ నివేదిక సారాంశం ప్రకారం.. ఈ విలేకరి గడచిన పదేళ్లుగా ఓ గిరిజన మహిళతో సహజీవనం చేస్తున్నాడు. కుటుంబ వివాదాల వల్ల భర్తకు దూరంగా ఉంటున్న ఈ మహిళను మాయమాటలతో విలేకరి లోబర్చుకున్నట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు.
అదేవిధంగా సుమారు మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి భార్య అయిన మరో గిరిజన మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆ కుటుంబానికి దగ్గరైన ఈ విలేకరి ఆమెను రెండుసార్లు కొత్తగూడెం కలెక్టరేట్ కు తీసుకువెళ్లినట్లు నిఘా వర్గాలు ఉన్నతాధికారులకు నివేదించాయి. ఈ విషయం తెలిసిన మొదటి గిరిజన మహిళతోపాాటు ఆమె తల్లి విలేకరి తీవ్రస్థాయిలో మందలించినట్లు నిఘా వర్గాల నివేదికను బట్టి తెలుస్తోంది.

అయినప్పటికీ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగి భార్యను తీసుకుని ఈనెల 21వ తేదీన విలేకరి కొత్తగూడెం వెడుతుండగా ఆ విషయం తెలుసుకున్న మొదటి మహిళతోపాటు ఆమె తల్లి గౌరారం టోల్ ప్లాజా వద్ద కాపుకాసి విలేకరిని నిలదీసిన సమయంలోనే ఘర్షణ జరిగినట్లు నిఘా వర్గాలు నివేదించాయి. ఈ సందర్భంగా విలేకరిని ఇద్దరు మహిళలు చితకబాదగా, గిరిజన మహిళలపై విలేకరి కూడా దాష్టీకానికి పాల్పడి దాడి చేసి కారులో ఎక్కించుకుని వెళ్లినట్లు భిన్న కథనాలు వెలువడ్డాయి.
అయితే మొత్తం ఎపిసోడ్ లో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. తనకు తాళి కట్టిన భార్య ఉండగానే ఈ విలేకరి భర్తతో దూరంగా ఉంటున్న గిరిజన మహిళను ఓ గుడిలో చట్ట వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది చాలదన్నట్లు రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయిన మరో గిరిజన మహిళను తన కారులో ఎక్కించుకుని ఆమెను కూడా పెళ్లి చేసుకునేందుకు వెడుతుండగానే టోల్ ప్లాజా వద్ద ‘కిడ్నాప్’ వివాదపు ఘటన జరిగినట్లు తాజా ప్రచారపు సారాంశం.
మొత్తంగా పాత్రికేయ వృత్తిని అడ్డుగా పెట్టుకుని పెనుబల్లిలో ప్రముఖ పత్రిక విలేకరి గిరిజన మహిళలపై సాగిస్తున్న దాష్టీకాలకు కొందరు అధికార పార్టీ నేతలు అండగా ఉంటున్నట్లు నిఘా వర్గాలే ఉన్నతాధికారులకు నివేదించడం గమనార్హం. టోల్ ప్లాజా వద్ద జరిగిన ఉదంతంలోనూ ఓ ప్రజాప్రతినిధి భర్త పోలీసు అధికారులకు ఫోన్లు చేసి దాష్టీకాల విలేకరికి దన్నుగా నిలిచినట్లు నిఘా వర్గాలు స్పష్టంగానే నివేదించాయి. అయితే గిరిజన మహిళలే టార్గెట్ గా ఈ విలేకరి అకృత్యాలపై గిరిజన సంఘాలు ఎలా స్పందిస్తాయనేది వేచి చూడాల్సిందే.