’’ఇటీవల పత్రికల, ఎలక్ట్రానిక్ మీడియా భాష జుగుప్సాకరంగా మారుతోoది. జర్నలిజం బాధితులకు కుడి ఎడమల కాపుకాయాలన్నారు నాటి పత్రికారంగ ప్రముఖులు. బాధితుల పక్షాన నిలిచే కాలం ఎప్పుడో పోయి మోచేతి నీళ్ళు తాగి తరించే కాలమొచ్చింది. ఇటీవల ఆపరేషన్ కగార్ మొదలైన నాటినుంచి మీడియా భాష అనేక జుగుప్సాకర విన్యాసాలు చేస్తోంది. లేపేసారు.. ఏశేశారు లాంటి పోలీస్ భాష, గుండాల భాషా వాడుతున్నారు. బాధితుల గుండెల్లో ముల్లుగుచిన తీరున ఉంటుంది. జర్నలిజంలో ఇలాంటి భాషా ప్రయోగం ఏ గురువు నేర్పి ఉండడు. ఎందుకు మరి ఈ వికృత భాషా ప్రయోగం శృతిమించుతుంది? జర్నలిస్ట్ సంఘాల నాయకులకు సీనియర్ జర్నలిస్టులకు ఈ వికృతి కనపడడం లేదా? అయ్యా.. మీరు బాధితుల పక్షం వహించకపోయినా పర్వాలేదు. అవమానించి బాధించకండి‘‘
దిగజారిన జర్నలిజపు భాషపై సేంద్రీయ వ్యవసాయదారుడు, మాజీ విప్లవకారుడు జిట్టా బాల్ రెడ్డి తన ఫేస్ బుక్ ఖాతా వాల్ పై వ్యక్తం చేసిన ఆవేదన ఇది. ఈ ఆవేదనలో అర్థముంది. బాల్ రెడ్డి వ్యక్తం చేసిన ఆవేదనపై ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. జర్నలిజపు భాష తెలిసినవారెవరూ ఇటువంటి జుగుప్సాకర భాషను వాడరు.. రాయరు కూడా. మేమూ జర్నలిస్టులమేనని ఉనికిని చాటేందుకు, తమకూ భాష వచ్చని చెప్పేందుకు చేస్తున్న వికృత ప్రయోగ ప్రయత్నంగా భావించడంలో తప్పు కూడా లేదు. ఇటువంటి భాషను నిలువరించేందుకు మీడియా పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు కూడా లేవనే చెప్పాలి.

వాస్తవంలో వృత్తి ధర్మానికి కట్టుబడిన జర్నలిస్టులెవరూ ఇటువంటి అసహ్య భాషను ఉపయోగించరు. నిజానికి ఎన్కౌంటర్లలో నక్సలైట్లే కాదు, పోలీసులు ప్రాణాలు కోల్పోయిన ఘటనల్లో చాలా మంది జర్నలిస్టులు సంయమన భాషను ఉపయోగించడాన్నిఎప్పుడో మర్చిపోయారనే చెప్పాలి. ‘మావోయిస్టులకు బిగ్ షాక్, ఖతం, హతం’ వంటి హెడ్డింగులకు కొదువే లేకుండా పోయింది. నక్సలైట్ల విషయంలోనే కాదు, పోలీసులకు ప్రాణ నష్టం సంభవించిన సందర్భాల్లోనూ హెడ్డింగుల్లో భాషా ప్రయోగం వికటించిన ఘటనలు అనేకం.

ఇక నక్సలైట్లు ఏ గ్రూపు వారనే అంశంలోనూ స్పష్టత లేని అనేక మంది పెద్ద పెద్ద జర్నలిస్టులగా చెలామణిలో ఉన్నారనేది కాదనలేని వాస్తవం. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో ‘న్యూ డెమోక్రసీకి చెందిన ముగ్గురు మావోయిస్టుల అరెస్టు’ అనే అక్షరాలతో ‘బిగ్ బ్రేకింగ్’ అంటూ ఫుల్ ఫ్లేట్ స్క్రోలింగ్ వార్తలు ప్రసారమైన ఉదంతాలు అనేకం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జర్నలిజపు భాషను. ఎవరో అల్లాటప్పా వ్యక్తులో, సంస్థలో ఇటువంటి భాషను ఉపయోగిస్తే అవగాహన లేమిగా భావించవచ్చు. కానీ ప్రముఖ సంస్థలుగా భావించే మీడియా వ్యవస్థల్లోనూ జుగుప్సాకరమైన భాషతో కూడిన హెడ్డింగులు ఉంటే? మరణానికి, దుర్మరణానికి, ఖతానికి, హతానికి తేడా తెలియని స్థితలో వార్తలు ప్రసారం చేస్తే, ప్రచురిస్తే..? దీన్నెలా అర్థం చేసుకోవాలన్నదే అసలు ప్రశ్న.

దాదాపు పాతికేళ్ల క్రితం.. 1999లో కొయ్యూరు ఎన్కౌంటర్ జరిగిన సందర్భంగా ఓ ప్రముఖ పత్రిక ప్రచురించిన వార్తా కథనపు హెడ్డింగ్ అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. ఇప్పటి మావోయిస్టు పార్టీని, అప్పటి పీపుల్స్ వార్ ను కోలుకోలేని నాయకత్వ నష్టానికి గురి చేసిన కొయ్యూరు ఎన్కౌంటర్ లో ఆ విప్లవ పార్టీకి చెందిన అగ్రనేతలు నల్లా ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేష్ లు మృతి చెందారు. ఈ ఘటనను దాదాపు అన్ని ప్రముఖ పత్రికలు కూడా బ్యానర్ స్టోరీలుగానే ప్రచురించాయి. పీపుల్స్ వార్ విప్లవోద్యమ సంస్థ చరిత్రలోనే ఆ పార్టీకి అతిపెద్ద నష్టాన్ని కలిగించిన ఘటన అది. ఈ ఎన్కౌంటర్ ఘటనపై ‘నల్లా ఆదిరెడ్డి హతం’ అనే శీర్షికతో, తాటికాయలంత అక్షరాలతో ఆ ప్రముఖ పత్రిక ప్రచురించిన వార్తా కథనంపై పీపుల్స్ వార్ పార్టీ అప్పట్లో భగ్గుమన్నట్లు ప్రచారం జరిగింది.
తమ పార్టీకి చెందిన అగ్రనేత ప్రాణాలు కోల్పోవడంపై ‘హతం’ అనే పదాన్ని ఉపయోగించడంపట్ల పీపుల్స్ వార్ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు, నిరసనను తెలుపుతూ ఆయా ప్రముఖ పత్రిక యాజమాన్యానికి ఘాటుగా లేఖ రాసినట్లు కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత జరిగిన అనేక ఎన్కౌంటర్ ఘటనల్లోనే కాదు, ఇప్పటి వరకు కూడా ఆ పత్రిక నక్సలైట్ల విషయంలో మరెప్పుడూ ‘హతం’ అనే పదాన్ని ఉపయోగించిన దాఖలాలు కనిపించలేదు. ఇంతకీ ‘హతం’ అనే పదంపై అప్పటి పీపుల్స్ వార్ పార్టీ స్పందించడానికి సహేతుక కారణం కూడా ఉన్నట్లు విప్లవ కార్యకలాపాల పరిశీలకులు చెబుతుంటారు. సాధారనంగా పత్రికా భాషలో ఖతం, హతం అనే పదాలను సమాజ వ్యతిరేకులపై, ప్రజా కంఠకులను ఉద్దేశించి వాడుతారు.
దొంగలు, గజదొంగలు, టెర్రరిస్టులు పోలీసు కాల్పుల్లో మరణించిన సందర్భాల్లో మాత్రమే ‘ఖతం.. హతం’వంటి పదాలను ఉపయోగించాలని జర్నలిజం స్కూళ్ల పాఠాల్లో బోధిస్తుంటారు. ‘హతం, ఖతం’ అనే పదాలు సమాజ ద్రోహుల పీడ వదిలిందనే భావనను వ్యక్తీకరిస్తాయని జర్నలిజం స్కూళ్లలో చెప్పేవారు. కానీ ప్రస్తుత మీడియా పోకడ శీర్షికల్లో జరుగుతోందేమిటి? ముఖ్యంగా యూ ట్యూబర్లు తమ వ్యూస్ కోసం తలాతోకా లేని హెడ్డింగులు పెడుతున్నారనే విషయాన్ని కొత్తగా చెప్పేదేమీ లేదు. జర్నలిజపు విలువలు, నైతికత గురించి తెలియని వారు ఇటువంటి శీర్షికలు పెడితే భాష, భావం తెలియని వ్యక్తులుగా వాళ్లను భావించవచ్చు. కానీ మీడియా తోపులమని జబ్బలు చరుచుకునేవారు సైతం ఇటువంటి హెడ్డింగులే పెడితే మాత్రం విప్లవోద్యమ అభిమానుల మనసు నొచ్చుకోవడమే కాదు, అవి సముచిత శీర్షికలు కావనే అభిప్రాయాన్ని సీనియర్ జర్నలిస్టులు వ్యక్తం చేస్తున్నారు.

దొంగలు వేరు, టెర్రరిస్టులు వేరు, నక్సలైట్లు వేరు. టెర్రరిజం, నక్సలిజం వేర్వేరు. విప్లవోద్యమానికి, భయోత్పాతానికి తేడా తెలియని స్థితిలో అనేక మంది జర్నలిస్టులు ఉన్నారనేది నిర్వివాదాంశం. జర్నలిజం స్కూళ్లలో ఆచార్యుల బోధన ప్రకారం.. పహల్గాంవంటి ఘటనలకు పాల్పడిన టెర్రరిస్టులు చస్తే ‘హతం’ అనొచ్చు, రెండున్నర దశాబ్ధాల క్రితం రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ఫాం హౌజుల్లో అత్యాచారాలకు తెగబడి, దోపిడీలకు, దొంగతనాలకు పాల్పడిన ముఠాలు ఎన్కౌంటర్లలో చచ్చిన ఉదంతాల్లో ‘ఖతం’ అనొచ్చు.

కానీ సమసమాజ స్థాపన కోసమంటూ అడవుల్లో తిరుగుతూ, అక్కడే జీవితాలను ముగిస్తున్న విప్లవకారుల మరణాలపై మీడియాలో వాడుతున్న భాష తీరుతెన్నులే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఇదే దశలో హింసావాదాన్ని మాత్రమే నమ్ముకున్న విప్లవ సంస్థలను ‘టెర్రర్’ వ్యవస్థలుగా అభివర్ణించే పాలక పార్టీల వాదనలోనూ మరో కోణం ఉంటే ఉండవచ్చు. కానీ విప్లవోద్యమంలో నిస్వార్ధంగా పనిచేస్తున్నవారు ఎన్కౌంటర్లలో మరణించిన సందర్భాల్లో ‘ఖతం, హతం’ అనే పదాలను ఉపయోగించినపుడే జిట్టా బాల్ రెడ్డి వంటి మాజీ విప్లవోద్యమకారులు జర్నలిజపు భాషా ప్రయోగంపై అభ్యంతరం వ్యక్తం చేయడంలో అర్ధముందనే అభిప్రాయాలు కూడా ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నాయి.